Sudarshan Reddy: సుదర్శన్‌రెడ్డి ఎంపికతోనే ప్రజాస్వామ్యానికి రక్ష
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:31 AM
ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీలు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి రాజ్యాంగాన్ని కాపాడాలని ..
బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీలు ఆయనకు ఓటేయాలి
పౌర సమాజం ప్రతినిధుల వినతి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్‌ఎస్, టీడీపీ, వైసీపీలు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి రాజ్యాంగాన్ని కాపాడాలని పౌర సమాజం ప్రతినిధులు కోరారు. ఆయనకు సంఘీభావంగా పౌర సమాజ ప్రతినిధులు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సామాజిక వేత్త హరగోపాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తి కనుక సుదర్శన్ రెడ్డిని వ్యతిరేకిస్తామని కేటీఆర్ అనడం సముచితం కాదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో మొదలైన టీడీపీ కూడా ఉపరాష్ట్ర పతి ఎన్నికలో తెలుగు వ్యక్తికి మద్దతుగా నిలవాలని కోరారు. కేవలం ఒక వ్యక్తి సూచనతో సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయలేదని, అది జాతీయస్థాయిలో వచ్చిన ప్రతిపాదన అని కోదండరాం పేర్కొన్నారు. రాజ్యాంగం మీద దాడి జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండడం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదని తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడు కె.శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన నక్సలైట్ల సానుభూతిపరుడే అయితే.. ఆయనను గోవా బీజేపీ ప్రభుత్వం మొదటి లోకాయుక్తగా ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతిగా గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ, బీఆర్‌ఎస్, వైసీపీపై ఉందని సీనియర్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా రాజ్యాంగ విలువలను కాపాడిన సుదర్శన్ రెడ్డి ఇప్పుడు చట్టసభల ద్వారా కూడా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించగలరని సీనియర్ ఎడిటర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీలకు అతీతమైన వ్యక్తి అని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, విశ్రాంత అధ్యాపకురాలు వనమాల తెలిపారు.