Minority Welfare: ఇందిరమ్మ రాజ్యంలో మైనార్టీలకు అండ
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:10 AM
ఇందిరమ్మ రాజ్యంలో మైనార్టీలకు అండగా ఉంటున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకర్గం రహమత్‌నగర్‌లో ముస్లింల కోసం.....
జూబ్లీహిల్స్‌లో ఖబ్రస్థాన్‌కు స్థలం: మంత్రి అడ్లూరి
హైదరాబాద్/ఎర్రగడ్డ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
ఇందిరమ్మ రాజ్యంలో మైనార్టీలకు అండగా ఉంటున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకర్గం రహమత్‌నగర్‌లో ముస్లింల కోసం ఖబ్రస్థాన్ స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆదివారం రహమత్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మైనార్టీ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. ఖబ్రస్థాన్ అభివృద్ధికి ప్రత్యేక నిఽధులు కేటాయిస్తామని, లైటింగ్, డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయాలతో పాటు బౌండర్ వాల్ నిర్మిస్తామని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మైనార్టీస్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ కళాశాల మైనార్టీల విద్యాపునరుజ్జీవనంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిల చెల్లింపునకు చర్యలు
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉపకారవేతనాల పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి హైదరాబాద్‌కు రాగానే ఆయనతో సమావేశమై ఆ బకాయిలపై చర్చిస్తానన్నారు. వీలైనంత త్వరలో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు రావాల్సిన డబ్బులు అందిస్తామన్నారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉపకార వేతనాలు వచ్చేదాకా రావొద్దు!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. సమస్య తీవ్రతను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరలో బకాయిలు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే.. పూర్తిస్థాయిలో పెండింగ్ బకాయి లు విడుదల అయ్యేంత వరకు తాము విద్యార్థులను పాఠశాలలకు రానివ్వబోమని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల తమ పిల్లల చదువులకు ఇబ్బంది ఎదురవుతుందని.. పాఠశాలలకు అనుమతించాలని కొందరు తల్లిదండ్రులు ఆదివారం మేనేజ్‌మెంట్‌లను సంప్రదించినట్లు తెలిసింది.