Sunitha Maganti Named BRS Candidate: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:31 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది. పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం సమావేశమైన కేసీఆర్.. ఆమె పేరును ఖరారు చేశారు. ...
ఖరారు చేసిన కేసీఆర్
కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సునీత
హైదరాబాద్/గజ్వేల్/మర్కుక్/బంజారాహిల్స్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది. పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం సమావేశమైన కేసీఆర్.. ఆమె పేరును ఖరారు చేశారు. మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి మాగంటి సునీతనే బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పేర్కొనగా.. ఇప్పుడు గులాబీబాస్ ఆమోదంతో అధికారిక ప్రకటన వెలువడింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం సునీత తెలంగాణ భవన్‌కు వెళ్లి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సునీత మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ అశయాలను కొనసాగించేందుకు పార్టీ అదిష్ఠానం తనకు అవకాశం ఇచ్చిందన్నారు. ప్రజల ఆశీర్వాదం, పార్టీ శ్రేణుల మద్దతు తనకు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే ఉప ఎన్నికలో తనను గెలిపిస్తుందన్నారు.
ప్రతి ఓటరును కలిసేలా కార్యాచరణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తదితరులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మాగంటి గోపీనాథ్‌కు జూబ్లీహిల్స్ ప్రజానీకంలో మంచి పేరుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అన్ని డివిజన్లు, బూత్ స్థాయిలో కార్యకర్తలను అప్రమత్తం చేయాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను నిశితంగా గమనించాలని సూచించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్ గెలుపు తథ్యమని, ప్రజల్లో ఆయా అంశాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.