Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు సునీతారెడ్డి?
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:17 AM
ఏపీ మాజీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి......
తదుపరి దర్యాప్తు ఎలా, ఎంతవరకూ చేయాలనేది దర్యాప్తు సంస్థ విచక్షణ
ఫలానా అంశానికే పరిమితం చేయాలని కోర్టు ఎలా నిర్దేశిస్తుందంటున్న నిపుణులు
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో రెండో నిందితుడు సునీల్‌యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్, ఏడో నిందితుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి సోదరుడైన వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డి మధ్య సందేశాలు, వారి పాత్రపై మాత్రమే సీబీఐ దర్యాప్తు చేయాలని.. ఈ ఒక్క అంశంపై మాత్రమే దర్యాప్తు పూర్తిచేసి నెలరోజుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన ఇచ్చిన ఈ తీర్పుకు సంబంధించిన అధికారిక తీర్పు కాపీ మంగళవారం వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఆ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని డాక్టర్ సునీతారెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు దర్యాప్తు చేయాలా? వద్దా? అనే విషయాన్ని మాత్రమే కోర్టు నిర్దేశించాలి తప్ప.. ఎలా చేయాలో, ఎంత వరకు చేయాలో దర్యాప్తు సంస్థకు నిర్దేశించకూడదు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు.. వివేకా హత్య కేసులోనే ఏ-8గా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి.. విచారణలో భాగంగా అడిగే ప్రశ్నలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సీబీఐకి నిర్దేశించగా, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసిందే. దర్యాప్తు ఎలా చేయాలో సంబంధిత ఏజెన్సీకి నిర్దేశించకూడదని అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. నిజానికి ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సునీతారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి కడప జైల్లో బెదిరించడం.. సునీతారెడ్డి, అమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌లపై కౌంటర్ కేసు పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడం.. మాజీ సీఎస్ అజేయ కల్లం స్టేట్‌మెంట్ ప్రకారం ఉదయం 5.30 గంటలకే వైఎస్ భారతి, వైఎస్ జగన్‌కు హత్య విషయం ఎలా తెలిసింది? నేరంతో ఇమిడి ఉన్న డబ్బు సంగతి.. ఇలా చాలా అంశాలపై దర్యాప్తు జరగాలని ఆమె విజ్ఞప్తిచేశారు. కానీ, కోర్టు ఒకే అంశానికి దర్యాప్తును పరిమితం చేయడంతో హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తన పిటిషన్‌పై విచారణ జరిపి, తదుపరి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి వచ్చాక.. అన్ని అంశాలపై దర్యాప్తు చేయనీయకుండా ఒకటే అంశానికి పరిమితం కావాలని సీబీఐని కట్టడి చేసే అధికారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉందా? అని సునీతారెడ్డి తన అప్పీలులో ప్రశ్నించే అవకాశం ఉంది. దీనిపై ఆమె తన న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.