G. Sudheer Babu: ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా సుధీర్‌బాబు
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:01 AM
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కమిషనర్‌గా జి.సుధీర్‌బాబును నియమించింది...
గ్రేటర్ పరిధిలో 4 కమిషనరేట్లు.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీగా పునర్విభజన
సైబరాబాద్ కమిషనర్‌గా ఎం.రమేశ్
మల్కాజిగిరికి అవినాష్ మహంతి బదిలీ
హైదరాబాద్ సీపీగా సజ్జనార్ కొనసాగింపు
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కమిషనర్‌గా జి.సుధీర్‌బాబును నియమించింది. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు మునిసిపల్ కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం.. వాటి పరిఽధిలోని ప్రాంతాలను నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా పునర్విభజన చేసింది. ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు పునర్విభజనలో భాగంగా నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా ఏర్పాటయ్యాయి. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్‌లు పాతవే కాగా.. రాచకొండ పరిధిలోని ప్రాంతాలతోనే మల్కాజిగిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటైంది. ఫ్యూచర్‌సిటీ పేరుతో మరో నూతన కమిషనరేట్ వచ్చింది. ఈ పోలీస్ కమిషనరేట్లకు సంబంఽధించి కమిషనర్ల నియామకంలో భాగంగా నలుగురు ఐపీఎ్‌సలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనర్‌గా ఉన్న జి.సుధీర్‌బాబును ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషన ర్‌గా నియమించారు. సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మహంతిని మల్కాజిగిరి కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇప్పటివరకు లాజిస్టిక్స్ విభాగం ఐజీగా పనిచేసిన ఎం.రమే్‌షను సైబరాబాద్ కమిషనర్‌గా నియమించారు. కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ కొనసాగనున్నారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరి ప్రాంతాన్ని.. ఈ నాలుగు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడా లేకుండా మినహాయించారు. దీనిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటుచేసి.. యాదాద్రి-భువనగిరి జిల్లాగా పేర్కొంటూ ఆ జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్‌ను నియమించారు.
ఏ కమిషనరేట్‌లోకి ఏయే ప్రాంతాలంటే..
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 2047 విజన్ డాక్యుమెంట్‌లోని లక్ష్యాలకు అనుగుణంగా రాష్ర్టాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు భాగాలుగా విభజించి, ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం, ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ర్టానికి అతి ముఖ్యమైన ఓఆర్‌ఆర్ లోపలి 27 మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. ఇదేవిధంగా ఇతర శాఖలనూ పునర్‌వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో: అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్, నానక్‌రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు పఠాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, రామచంద్రాపురం, అమీన్‌పూర్ తదితర ప్రాంతాలు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో: కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు.
ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలో: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు.