Share News

Sudden Musi River Floods: కళ్లు మూసి తెరిచేలోగా..

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:01 AM

మూసీకి వరదొచ్చింది. ఆ వరద కట్టలు తెంచుకుంది. గంధంగూడ నుంచి నాగోలు దాకా గట్టున, ఆ సమీపంలో ఉన్న వేల సంఖ్యలో ఇళ్లను వరద ముంచెత్తింది...

Sudden Musi River Floods: కళ్లు మూసి తెరిచేలోగా..

  • గంధంగూడ నుంచి నాగోలుదాకా పరిస్థితి ఆగమాగం.. వరదతో పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర అల్లకల్లోలం

హైదరాబాద్‌ సిటీ/చాదర్‌ఘాట్‌/అఫ్జల్‌గంజ్‌/ఓల్డ్‌మలక్‌పేట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మూసీకి వరదొచ్చింది. ఆ వరద కట్టలు తెంచుకుంది. గంధంగూడ నుంచి నాగోలు దాకా గట్టున, ఆ సమీపంలో ఉన్న వేల సంఖ్యలో ఇళ్లను వరద ముంచెత్తింది. ఆ వరద తీవ్రతకు తీరానికి అనుకొని ఉన్న ఇళ్లలోని జనానికి తేరుకునే సమయమే లేకపోయింది. చేతికందిన వస్తువులతో పిల్లలనెత్తుకొని.. కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్ల మీదకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. లంగర్‌హౌస్‌ వద్ద బాపూఘాట్‌ వంతెనను తాకుతున్నట్లుగా ప్రవహిస్తూ భయపెట్టిన మూసీ.. చాదర్‌ఘాట్‌లోని కాజ్‌వే బ్రిడ్జ్‌పై నుంచి 6 అడుగుల ఎత్తులో.. మూసారంబాగ్‌ వంతెనపై నుంచి 10 అడుగుల ఎత్తులో పోటెత్తెంది. గత కొన్ని దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని రీతిలో మూసీ మహోగ్రరూపమిది. వికారాబాద్‌, తాండూరులో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నుంచి 30వేల క్యూసెక్కుల నీరు వదులుతుండటంతో శుక్రవారం సాయంత్రం మొదలైన మూసీ వరద శనివారానికి మహోగ్రరూపం దాల్చింది. ఒకరంగా 1908 నాటి ప్రళయాన్ని గుర్తుకు తెచ్చింది. శుక్రవారం రాత్రి నుంచే లంగర్‌హౌజ్‌ నుంచి జియాగూడ, పురానాపూల్‌, చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, శంకర్‌నగర్‌, ముసారంబాగ్‌ ప్రాంతాల్లోని నదీతరంలో ఉధృతి పెరిగింది. ముసానగర్‌, రసూల్‌పుర, వినాయకవీధిలోని దాదాపు వెయ్యి ఇళ్లలోకి వరద ప్రవహించడంతో బాధితులు ఇళ్లను వీడి బయటకొచ్చారు. చాలామందిని సహాయక సిబ్బంది బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చాయి. అధికారులు ముందే అప్రమత్తం చేసి ఉంటే ఇళ్లలోని అవసరమైన వస్తువులనైనా తీసుకొని బయటకొచ్చే అవకాశం ఉండేదని, ఇప్పుడు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చాదర్‌ఘాట్‌, మూసారంబాగ్‌ వంతెనలపై రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి, పురానాపూల్‌ బ్రిడ్జిపై రాకపోకలు స్తంభించిపోయాయి. అంబర్‌ పేటలోని అంబేడ్కర్‌నగర్‌లో ఇళ్లలో చిక్కుకున్నవారిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌లో గాంధీ సమాధి ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. లంగర్‌హౌస్‌, కార్వాన్‌ సహా మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గౌరెల్లి-ప్రతాపసింగారం రోడ్డులో వాహనాలను నిలిపివేశారు.


డ్రోన్‌తో ఆహార ప్యాకెట్లు

మూసారంబాగ్‌ లోలెవల్‌ బ్రిడ్జికి అనుకొని హై లెవల్‌ బ్రిడ్జి పనులు చేపట్టారు. శుక్రవారం రాత్రి వచ్చిన వరదతో నిర్మాణ సామగ్రి పూర్తిగా కొట్టుకుపోయింది. జేసీబీ మునిగిపోయింది. డీసీఎం బోల్తా పడింది. మూసారంబాగ్‌ బ్రిడ్జి సమాంతర రోడ్డు చెరువును తలపిస్తోంది. ఈ రోడ్డులో పార్క్‌ చేసిన పైవేటు బస్సులు, రిపేరింగ్‌కు వచ్చిన కార్లు వరదలో మునిగిపోయాయి. మూసారాంబాగ్‌ బ్రిడ్జికి సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు పూర్తిగా మునిగిపోయింది. చాదర్‌ఘాట్‌ కాజ్‌వే బ్రిడ్జికి ఇరువైపుల మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక వీధిలోని వందల ఇళ్లు మునిగాయి. అక్కడి నుంచి దాదాపు 1100 మందిని ఆరు పునరావాస కేంద్రాలకు తరలించారు. రసూల్‌పురలోని ఓ భవనంలో చిక్కుకున్న నలుగురిని బయటికి తీసుకురావడానికి సహాయక బృందాలు ప్రయత్నించినా వారు బయటకు వచ్చేందుకు నిరాకరించారు. తమకు ఆహారం, తాగునీరు, మొబైల్‌ చార్జింగ్‌ కోసం పవర్‌ బ్యాంక్‌లను అందజేయాలని కోరారు. సిబ్బంది వారికి డ్రోన్‌ ద్వారా ఆహార ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు అందజేశారు. గోల్నాక డివిజన్‌లోని సంజయ్‌గాంధీనగర్‌, ఫాతీమానగర్‌, న్యూకృష్ణానగర్‌, ఓల్డ్‌కృష్ణానగర్‌, అంబేడ్కర్‌నగర్‌ బస్తీలలోని ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వారిని కమ్యూనిటీ హాల్స్‌, ప్రభుత్వ పాఠశాలలకు తరలించి భోజన వసతి కల్పించారు. అంబేడ్కర్‌నగర్‌ బస్తీలోని వారికి సహాయక సబ్బింది బోట్లలో వెళ్లి ఆహార పొట్లాలు అందజేశారు.

అంతా 20 నిమిషాల్లోనే..

ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌ శంకర్‌నగర్‌, పద్మానగర్‌ కాలనీల్లో సుమారు వెయ్యికి పైగా ఇళ్లు మూసీ వరద ఉదృతికి మునిగిపోయాయి. శుక్రవారం సాయంత్రం ఓక్కసారిగా ఇళ్లలోకి వరద రావడంతో 20 నిమిషాల్లోనే ఇళ్లు మునిగిపోయాయని, సామాన్లన్నీ వదిలేసి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశామని.. రాత్రంతా నిద్రలేకుండా గడిపామని స్థానికులు ఆవేదనగా చెప్పారు. తమ కూతురు ఇటీవలే ప్రసవించిందని.. సాయంత్రం ఒక్కసారిగా ఇంట్లోకి వరద పోటెత్తడంతో పచ్చిబాలింతరాలైన కుమార్తెను, చంటిబిడ్డను తీసుకొని బయటకొచ్చానని.. కాసేపటికే ఇల్లు పూర్తిగా మునిగిపోయిందని అలీమా బేగం అనే మహిళ పేర్కొంది.


మునిగిన పురానాపూల్‌ శ్మశానవాటిక

వరద ఉదృతితో పురానాపూల్‌ హిందూ శ్మశానవాటికలోని 12 ఘాట్లు నీటమునిగాయి. ప్రవాహానికి కట్టెలు, ఆయిల్‌, ఇతర సామగ్రి కొట్టుకుపోయాయి. అంతిమ యాత్ర వాహనాలు వరదలో మునిగిపోయాయి. ఒక వాహనం మూసీ ఉధృతికి కాలువలో కొట్టుకుపోయిందని శ్మశానవాటిక నిర్వాహకులు తెలిపారు. శనివారం కొన్ని మృతదేహాలను శ్మవానవాటికకు తీసుకొచ్చినా అంతిమ సంస్కారాలు చేయలేని పరిస్థితి నెలకొంది.

వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం

పురానాపూల్‌ వద్ద మూసీనది ఒడ్డులో ఉన్న శివాలయం వరదలో మునిగింది. ఆలయం పైఅంతస్తులో ఉన్న పూజారి కుటుంబం బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో చిక్కుకుపోయింది. వరద తగ్గేంతవరకు బయటికి రావద్దని హైడ్రా అధికారులు వారికి సూచించారు.

ఎంజీబీఎ్‌సను ముంచేసిన వరద

ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌ను ఎన్నడులేని విధంగా మూసీ వరద ముంచేసింది. నీటి ఉధృతి పెరగడంతో ఎంజీబీఎస్‌ నుంచి బస్సుల రాకపోకలు ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. బస్‌స్టేషన్‌లోని ప్రయాణికులను తాళ్లసాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎంజీబీఎ్‌సలో ప్లాట్‌ఫారం 29 నుంచి 42 వరకు మూసీవరదలో మునిగిపోయాయి. ఎంజీబీఎస్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్న 2500కు పైగా సర్వీసులు నగరంలోని పలు ప్రాంతాలను జిల్లాలకు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీలత తెలిపారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ వైపు వెళ్లే సర్వీసులు జేబీఎస్‌ నుంచి నడుపుతున్నారు. వరంగల్‌, హనుమకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ నుంచి, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీనగర్‌ నుంచి నడుపుతున్నారు. మహబూబ్‌నగర్‌, కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్‌ నుంచి నడుపుతున్నారు. బస్సుల సమాచారం కోసం టీజీఎ్‌సఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్ల (040-69440000, 040-23450033)లో సంప్రదించాలన్నారు. వరద ఉదృతి పూర్తిగా తగ్గితే బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో చెత్త తొలగించి బస్సుల రాకపోకలు ఆదివారం నుంచి పునరుద్ధరిస్తామని చెప్పారు.

2.jpg4.jpg3.jpg

Updated Date - Sep 28 , 2025 | 02:01 AM