Sudarshan Reddy Takes Charge: ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:00 AM
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో బుధవారం ఉదయం...
శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. పథకాల అమలుతీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తాం
అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
బాధ్యతల స్వీకరణ వేళ సుదర్శన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు వేదపండితుల ఆశీర్వచనం అనంతరం ఫైలుపై సంతకం చేసి బాఽధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారుడు కె. కేశవరావు, మహ్మద్ షబ్బీర్ అలీ, ఖమ్మం ఎంపీ ఆర్. రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, వెడ్మ బొజ్జు, కె. వెంకటరమణారెడ్డి, కె. మదన్‌మోహన్‌రావు, పైడి రాకే్‌షరెడ్డి, కె. జయవీర్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు మానాల మోహన్‌రెడ్డి, సుంకెట అన్వే్‌షరెడ్డి, ఈరవత్రి అనిల్ కుమార్, గుత్తా అమిత్‌రెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కె. జానారెడ్డి, కొండపల్లి దయాసాగర్, మునిపల్లి సాయిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, నరాల రత్నాకర్, ఏబీ శ్రీనివాస్, సూదిని పద్మారెడ్డి, ఆకుల లలిత, కాటిపల్లి నగే్‌షరెడ్డి, నిజామాబాద్ జిల్లా నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట
సుమారు రెండేళ్ల ప్రజాపాలనలో ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు పి. సుదర్శన్‌రెడ్డి చెప్పారు. సెక్రటేరియట్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 18 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించామని, రెండేళ్లలో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.7 వేల కోట్లు చెల్లించిందన్నారు. మహాలక్ష్మి పథకంలో పేద కుటుంబాలకు రూ. 500 చొప్పున గ్యాస్‌సిలిండర్ పంపిణీ చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్యం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకంలో ప్రతి నెల 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. రైతుల సంక్షేమానికి రెండేళ్లలో రూ. 1.13 లక్షల కోట్ల నిధులు ఖర్చుచేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని సుదర్శన్‌రెడ్డి చెప్పారు.