Pregnancy Depression: ఆత్మహత్య ఆలోచనల్లో అమ్మ
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:14 AM
రాష్ట్రంలో గర్భిణులు, బాలింతల మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరరీతిలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణలో 20 వారాల్లోపు గర్భిణుల్లో...
20 వారాల్లోపు గర్భిణుల్లో 7.6 శాతం మందికి సూసైట్ థాట్స్
తెలంగాణలో అధ్యయనం.. బాలింతల్లోనూ మానసిక సమస్యలు
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గర్భిణులు, బాలింతల మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరరీతిలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణలో 20 వారాల్లోపు గర్భిణుల్లో 7.6 శాతం మంది ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్లు తేలింది. ప్రసవ సమయంలో 15-20 శాతం మంది గర్భిణులు తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో బాలింతల ప్రసవానంతర మానసిక ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో అధ్యయనం జరిగింది.. జార్జ్ ఇనిస్టిట్యూట్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో, యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ మద్దతుతో ప్రసవానంతర మానసిక ఆరోగ్య ప్రాజెక్ట్ (పీఆర్‌ఏఎంహెచ్)ను అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ప్రధానంగా పేదరికం, అసమానతలు, గృహ హింస, కుటుంబ మద్దతు లేకపోవడంతో గర్భిణులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేల్చింది. దీనిపై సోమవారం ఢిల్లీలో జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా ఆ స్టడీ వివరాలను విడుదల చేస్తూ, జాతీయ నిపుణుల సమావేశాన్ని నిర్వహించింది. దేశంలో ఏటా సగటున 2.5 కోట్లకు పైగా ప్రసవాలవుతున్నాయి. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం ఏడాది వరకు తల్లులు ఎదుర్కొనే మానసిక సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. వీటిని గుర్తించడం లేదు. ప్రసవానంతర డిప్రెషన్ 14 శాతం నుంచి 24 శాతం వరకు ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. మాతృ మరణాలు గత 20 ఏళ్లలో సగం వరకు తగ్గాయి. అదే సమయంలో మాతృ ఆత్మహత్యలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 2020లో కేరళలో చేసిన ఓ అధ్యయనంలో ప్రతి ఐదు మాతృ మరణాల్లో ఒకటి ఆత్మహత్య అని తేలింది. దీంతో ఆ సమస్య తీవ్రత ఏంటో అర్థమవుతోంది. గర్భిణులకు ప్రసవం తర్వాత మానసిక ఆరోగ్యంపై పేదరికం, లింగ వివక్ష, గృహ హింస వంటి సామాజిక అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మగ బిడ్డనే కనాలనే ఒత్తిడి గర్భిణులపై తీవ్రంగా ఉంటోంది. లేకపోతే అత్తింటి వైపునుంచి అనేక అవమానాలు, సూటిపోటి మాటలు భరించాల్సివస్తుందనే భయాందోళనలు వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు వెంటవెంటనే గర్భం ధరించడం, ప్రెగ్నెన్సీల మధ్య తక్కువ సమయం ఉండటంతో నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిరావడం కూడా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బిడ్డ పుట్టిన తర్వాత తల్లులపై కుటుంబ, సమాజ ఒత్తిళ్లు పెరుగుతుండటం వల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
నిపుణులేమంటున్నారంటే
దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య విధానాల్లో ప్రసవానంతర మానసిక ఆరోగ్యాన్ని ప్రత్యేక అంశంగా చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రసవానంతర డిప్రెషన్ తల్లినే కాకుండా శిశువు ఆరోగ్యాన్ని, కుటుంబ శాంతిని కూడా దెబ్బతీస్తోందంటున్నారు. డాక్టర్లు, నర్సులు, ఆశావర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ప్రతి రాష్ట్రం తదనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. గర్భిణుల్లో మానసిక ఆరోగ్య సమస్యను వేరుగా కాకుండా సాధారణ గర్భధారణ, ప్రసవానంతర వైద్యంలో భాగంగా చేర్చాలని నిపుణులు కోరుతున్నారు.