Student Protests: మా ప్రిన్సిపాల్‌ను ఎక్కడికైనా పంపితే పురుగుల మందు తాగుతాం
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:51 AM
తమను ఐదేళ్లుగా కంటికిరెప్పలా చూసుకుంటున్న ప్రిన్సిపాల్ ధరావత్ రాజును డిప్యూటేషన్‌పై పంపిస్తే పురుగుల మందు తాగుతామని, సార్ లేకుంటే పాఠశాలలో చదువుకోబోమని...
సార్ లేకపోతే మేం చదువుకోం.. టీసీలు ఇవ్వండి
స్టేషన్‌ఘన్‌పూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్
రాజు డిప్యూటేషన్‌ను వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన
స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తమను ఐదేళ్లుగా కంటికిరెప్పలా చూసుకుంటున్న ప్రిన్సిపాల్ ధరావత్ రాజును డిప్యూటేషన్‌పై పంపిస్తే పురుగుల మందు తాగుతామని, సార్ లేకుంటే పాఠశాలలో చదువుకోబోమని, టీసీలు ఇవ్వాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని గిరిజన అశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న ఓ టీచర్ విద్యార్థులతో పాలు కాయించడం, అంట్లు తోమించడంతో పాటు, ప్రిన్సిపాల్ గదిలో విద్యార్థులను మోకాళ్ల పైన నిలబెట్టిన ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ రాజును డిప్యూటేషన్‌పై అరెపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు శనివారం మధ్యాహ్నం భోజనం చేయకుండా పాఠశాల గేటు ఎదుట బైఠాయించారు. ఆర్డీవో వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ వేణు, ఎస్సై వినయ్‌కుమార్‌లు పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నెల రోజుల్లో సార్‌ను మళ్లీ తీసుకువచ్చేలా చూస్తామని పేర్కొన్నా వినలేదు. దీంతో ఆర్డీవో.. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడి ప్రిన్సిపాల్ డిప్యూటేషన్ తమ పరిధిలో లేదని, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్(పీవో)తో మాట్లాడి నెల రోజుల వ్యవధిలో ఆయనను తీసుకువచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. దీంతో విద్యార్థులు శాంతించి, హాస్టల్‌కు వెళ్లి భోజనం చేశారు.