Share News

Students Protest in Shadnagar: ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:56 AM

నిత్యం తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ శైలజను సస్పెండ్‌ చేయాలంటూ నాగర్‌కర్నూల్‌ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు కదం తొక్కారు...

Students Protest in Shadnagar: ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు

  • వేధింపులపై గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన

  • షాద్‌నగర్‌లో ఆరు గంటల పాటు ధర్నా

  • ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌

  • పోలీసులు, విద్యార్థినుల మధ్య తోపులాట

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌ రూరల్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నిత్యం తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ శైలజను సస్పెండ్‌ చేయాలంటూ నాగర్‌కర్నూల్‌ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు కదం తొక్కారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రధాన కూడలిలో 400 మందికి పైగా విద్యార్థినులు సుమారు 6 గంటల పాటు ధర్నా చేశారు. కలెక్టర్‌ వచ్చి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడామని, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని షాద్‌నగర్‌ సీఐ విజయకుమార్‌ తెలిపినా వినలేదు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థినుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయింది. చివరి కి పోలీసులు విద్యార్థినులను ఒప్పించి పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ జోనల్‌ అధికారి నిర్మల కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌ వేధింపుల గురించి విద్యార్థినులు ఏకరువు పెట్టారు. గుడ్‌మార్నింగ్‌ చెప్పలేదని ఇంటర్నల్‌ పరీక్షలకు రానివ్వలేదన్నారు. ప్రిన్సిపాల్‌ను కూడా విచారించి సర్కారుకు నివేదిక అందజేస్తామని, వారంలో చర్యలు తీసుకుంటామని నిర్మల చెప్పారు.

విద్యార్థుల నుంచే ఫీజుల వసూలు

నాగర్‌కర్నూల్‌కు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాలను షాద్‌నగర్‌ శివారులోని ఖాళీగా ఉన్న నూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా శైలజ పనిచేస్తున్నారు. ఆమె సూర్యాపేట గురుకుల డిగ్రీ కళాశాలలో పనిచేస్తుండగా పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ కళాశాలకు బదిలీ చేశారు. ఆమె ఇక్కడా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. తమ పరీక్ష ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తున్నా ఫీజు చెల్లించాలంటూ 490 మంది విద్యార్థినుల నుంచి రూ.2,300 చొప్పున వసూలు చే శారని తెలిపారు. విద్యార్థినుల కార్ప్‌సఫండ్‌ కోసం ప్రతి నెలా రూ.50 వేలు జమ చేస్తుంటే ఆ డబ్బులను తమకు ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా ఫైనలియర్‌ విద్యార్థిని వివాహం చేసుకుంటే ఆమె తల్లిదండ్రులు ఎంత కట్నం ఇస్తున్నారో.. అందులో సగం ఎంతైతే అంత తనకివ్వాలని వేధిస్తున్నారని తెలిపారు. కళాశాలకు 20 కేజీల మటన్‌ సరఫరా అవుతుంటే.. అందులో సగం ప్రిన్సిపాల్‌ నొక్కేస్తున్నారని చెప్పారు. ప్రిన్సిపాల్‌ శైలజకు ఇతర అధ్యాపకులు కూడా అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. కాగా, విద్యార్థినుల ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Updated Date - Nov 03 , 2025 | 03:56 AM