కస్తూర్భాలో విద్యార్థులకు అందని భోజనం
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:04 PM
ప్రభుత్వం నెలనెలా నిధులు విడుదల చేయకపోవడంతో కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో బాలికలకు భోజనం కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.
-బిల్లులు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
-మూడు నెలలుగా నిధులివ్వని రాష్ట్ర ప్రభుత్వం
-జిల్లాలో రూ. 90 లక్షల మేర బిల్లులు పెండింగ్
-విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్న ప్రత్యేక అధికారులు
మంచిర్యాల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నెలనెలా నిధులు విడుదల చేయకపోవడంతో కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో బాలికలకు భోజనం కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మూడు నెలల నుంచి కాంట్రాక్టర్ల ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో సరుకులు సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్న స్పెషల్ ఆఫీసర్లు విద్యార్థినులను ఇళ్లకు పంపించి వేశారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో చోటు చేసుకుంది.
రూ. 90 లక్షల మేర పెండింగ్....
జిల్లాలో 18 కస్తూర్భాగాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో 11 స్కూళ్లకు అనుబంధంగా జూనియర్ కళాశాలు కూడా కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు మొత్తం 4,700 మంది చదువుతున్నారు. ఆయా పాఠశాలకు నెలకు సగటున రూ. 30 లక్షల మేర నిధులు అవసరం అవుతాయి. జిల్లాకు సంబంధించి గత మూడు నెలల నుంచి బిల్లులు విడుదల కావడం లేదు. దీంతో సరుకులు సరఫరా చేయలేక సంబంధిత కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. కొద్ది రోజులపాటు ఏదోలా తంటాలు పడి సర్దుకు వచ్చిన పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌ఓలు) కూడా ఇక సర్దుబాటు చేయలేక విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. జిల్లాలోని హాజీపూర్ మండలంలోని కస్బూర్భాగాంధీ విద్యాలయంలో ఈ నెల 11న ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల ఎస్‌వో స్వప్న 6 నుంచి 9వ తరగతి విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి, పిల్లలను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా సమాచారం ఇచ్చారు. దీంతో ఆయా తరగతులకు చెందిన విద్యార్థులంతా భోజనం అందుబాటులో లేక ఇంటిబాట పట్టారు. విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం ప్రొటీన్‌లతో కూడుకున్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి తిరిగి భోజనం పెట్టాల్సి ఉంది. దీని కోసం రాజేందర్ అనే కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుని సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే బిల్లులు రాకపోవడంతో వారం రోజులుగా కాంట్రాక్టర్ సరుకులు పంపలేదు. దీంతో ఎస్‌వో సొంత డబ్బులతో సరుకులు తెప్పించి టిఫిన్, భోజనం ఏర్పాటు చేశారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొనగా బయటకు చెప్పేందుకు వెనుకంజ వేస్తున్నారు.
ఒక నెల బిల్లులు విడుదల....
ఇదిలా ఉండగా ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు జూన్ నెలకు సంబంధించిన బిల్లులు విడుదల చేసింది. దీంతో ప్రస్తుతానికి విద్యార్థులకు భోజనం అందుతోంది. సక్రమంగా నిధులు విడుదల చేయడం ద్వారా విద్యార్థుల తరగతులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.