Share News

Students Must Take Supplementary exams: ఫార్మసీ పరీక్షలు మళ్లీ నిర్వహించలేం!

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:46 AM

ప్రైవేటు కాలేజీల సమ్మెతో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలను మళ్లీ నిర్వహించలేమని...

Students Must Take Supplementary exams: ఫార్మసీ పరీక్షలు మళ్లీ నిర్వహించలేం!

  • సప్లిమెంటరీ రాసుకోండి.. స్పష్టం చేసిన విద్యాశాఖ కార్యదర్శి

  • ప్రైవేటు కాలేజీల సమ్మెతో గైర్హాజరైన 7 వేల మంది విద్యార్థులు

  • విద్యార్థుల్లో ఆందోళన.. సీఎంను కోరుతామన్న ‘ఫాతి’

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కాలేజీల సమ్మెతో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలను మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని విద్యార్థులకు విద్యా శాఖ స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల డిమాండ్‌తో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు ఈ నెల 3 నుంచి నాలుగు రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 4వ తేదీ నుంచే బీ-ఫార్మసీ ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జేఎన్టీయూ పరిధిలో మొత్తం 63 ఫార్మసీ కాలేజీలు ఉండగా.. ఏడున్నర వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. కానీ కాలేజీల సమ్మె నేపథ్యంలో జేఎన్టీయూ క్యాంప్‌సకు చెందిన రెండు కాలేజీలు, మరో ఏడు ప్రైవేటు కాలేజీలు మాత్రమే పరీక్షలు నిర్వహించాయి. మొత్తం విద్యార్థుల్లో 9శాతం మంది మాత్రమే రాశారు. సమ్మె ఈనెల 7న ముగిసినా.. అప్పటికే అనాటమీ-ఫిజియాలజీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పరీక్షలు పూర్తయ్యాయి. వీటికి గైర్హాజరైన విద్యార్థులకు ఆ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని కాలేజీలు జేఎన్టీయూను అభ్యర్థించాయి. కానీ దీనికి విద్యాశాఖ కార్యదర్శి అంగీకరించలేదని తెలిసింది. పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, విద్యార్థులు సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనితో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతి) తెలిపింది.

Updated Date - Nov 12 , 2025 | 02:46 AM