Vehicle Overturns While Carrying Textbooks: వాహనం బోల్తా పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:10 AM
పాఠ్యపుస్తకాలను తరలిస్తున్న బొలేరో వాహనం బోల్తా పడి నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది...
పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చేందుకు వెళ్లిన విద్యార్థులు
ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్ : డీఈవో
నాగర్‌కర్నూల్/పెద్దకొత్తపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పాఠ్యపుస్తకాలను తరలిస్తున్న బొలేరో వాహనం బోల్తా పడి నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. సాతాపూర్ జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలం ఆదేశాల మేరకు పుస్త్తకాలను తరలించడానికి పెద్దకొత్తపల్లిలోని మండల విద్యా వనరుల కేంద్రానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో జొన్నల బొగడ-బాచారం బస్సు స్టేజీ మధ్య వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడగా, అందు లో ఉన్న నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. శివ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మిగతావారిని చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులతో ప నులు చేయిస్తూ ప్రమాదానికి కారణమైన ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలంను సస్పెండ్ చేసినట్లు డీఈవో రమే్‌షకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.