Telangana Education Department: ఆధార్ లేకున్నా బడిలో చేరొచ్చు
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:41 AM
ఆధార్, జనన ధ్రువీకరణ వంటి గుర్తింపు పత్రాలు, బదిలీ సర్టిఫికెట్(టీసీ) వంటివి లేకపోయినా ఇకపై పిల్లలు బడిలో చేరొచ్చు. అవి ఉంటేనే ప్రవేశం కల్పిస్తామని పాఠశాలలు...
జనన ధ్రువీకరకణ పత్రమూ అవసరం లేదు
అవి లేవని బడిలో ప్రవేశాలను నిరాకరించొద్దు
టీసీ జారీలో ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు విద్యా శాఖ ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆధార్, జనన ధ్రువీకరణ వంటి గుర్తింపు పత్రాలు, బదిలీ సర్టిఫికెట్(టీసీ) వంటివి లేకపోయినా ఇకపై పిల్లలు బడిలో చేరొచ్చు. అవి ఉంటేనే ప్రవేశం కల్పిస్తామని పాఠశాలలు చెప్పడానికి అవకాశం లేదు. గుర్తింపు పత్రాలు లేనికారణంగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను నిరాకరించడానికి వీల్లేదని తెలంగాణ విద్యా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్, జనన ధ్రువీకరణ వంటి గుర్తింపు పత్రాలు లేనందున నగరంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస శ్రామికుల పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోవడం లేదు.
అందువల్ల వారంతా చదువుకు దూరమవుతున్నారని వివరిస్తూ.. ‘అ..ఆ కు అడ్డంకిగా ఆధార్’ పేరుతో ఈ నెల 14న ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై తెలంగాణ విద్యా శాఖ స్పందించింది. విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్14(2) ప్రకారం జనన ధ్రువీకరణ వంటి గుర్తింపు పత్రాలు లేనికారణంగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను నిరాకరించడానికి వీల్లేదని ఈ నెల 14న విడుదల చేసిన జీవోలో పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి పత్రాలు లేకపోయినా పిల్లలకు ప్రవేశం కల్పించాలని తెలంగాణలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో విద్యార్థి ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారుతున్నప్పుడు బదిలీ సర్టిఫికెట్(టీసీ) వెంటనే జారీ చేయాలి. జాప్యం చేసిన పక్షంలో సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కూడా అందులో హెచ్చరించారు. టీసీ లేకపోయినా పిల్లలను స్కూల్లో చేర్చుకోవాలని ఆదేశించారు.
ఇవీ చదవండి:
మీరెప్పుడైనా 'అరోరా బొరియాలిసిస్' చూశారా.?
బీహార్ ఎన్నికలు.. ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి మైథిలీ ఠాకూర్