Snake Sighting: పాము కనిపించిందని చెప్పినందుకు..విద్యార్థినిని గురుకులం నుంచి గెంటేశారు
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:51 AM
పాము కనిపించిందని చెప్పినందుకు ఓ విద్యార్థినిని గురుకులం నుంచి బహిష్కరించిన ఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...
5 నెలలుగా విద్యకు దూరం చేసిన టీచర్లు
వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఘటన
పర్వతగిరి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాము కనిపించిందని చెప్పినందుకు ఓ విద్యార్థినిని గురుకులం నుంచి బహిష్కరించిన ఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్వతగిరి మండలం వడ్లకొండకు చెందిన శివాని ఈ ఏడాది నుంచి పర్వతగిరి గురుకులంలో ఐదో తరగతి చదువుతోంది. జూలై మొదటివారంలో గురుకులం ఆవరణ లో పిచ్చిమొక్కలు తొలగిస్తుండగా కాలుపై నుంచి పాము వెళ్లడంతో భయాందోళనకు గురైన శివాని వెంటనే ఉపాధ్యాయులకు విషయాన్ని చెప్పింది. పాము కాటేసిందని భావించిన వైస్ ప్రిన్సిపాల్ స్వాతి.. విద్యార్థినిని నాటు వైద్యం కోసం పంపించింది. ఈ విషయం బయటకు రావడంతో హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. శివానిని పరీక్షించిన వైద్యులు పాము కాటు వేయలేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులకు.. గురుకుల సిబ్బంది శివానిని అప్పగించి ఇంటికి పంపించారు. తర్వాత కొన్ని రోజులకు విద్యార్థినిని గురుకులంలో తిరిగి చేరినా.. శివాని తీరు సరిగా లేదని, తాము నాటు వైద్యం చేయించినట్లు పత్రికల్లో కథనాలు రావడం వల్ల తమ పరువు పోయిందంటూ తల్లిదండ్రులపై వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, క్లాస్ టీచర్ మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయం నుంచి తీసుకెళ్లాలని ఆదేశించడంతో చేసేదేమీ లేక.. తల్లిదండ్రులు తమ కూతురుని ఇంటికి తీసుకొచ్చారు. ఐదు నెలల నుంచి విద్యకు దూరం చేసి మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కొన్నేళ్లుగా వైస్ ప్రిన్సిపాళ్లు స్వాతి, జ్యోత్న్సల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేస్తున్నారు. చిన్న కారణాలకే విద్యార్థులను వేధిస్తుండడంతో కొందరు గోడ దూకి పారిపోయారని చెబుతున్నారు. శ్రమదానం పేరిట విద్యార్థులతో పని చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు.
విద్యార్థినికి హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేదు
’శివానికి హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేదు. తల్లిదండ్రులతో ఉండాలనే.. మాపై నిందలు మోపి ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు అమ్మాయిని బలవంతంగా హాస్టల్‌లో వదిలి వెళ్తున్నారు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందనే విద్యార్థిని ఇంటికి పంపించాం. విద్యార్థిని తల్లిదండ్రుల ఆరోపణల్లో అవాస్తవం’
- అపర్ణ, ప్రిన్సిపాల్