Share News

Mahabubnagar: విద్యార్థిపై గంజాయి బ్యాచ్‌ దాడి

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:27 AM

పాలమూరులో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో ఓ విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించడంతో బాధితుడి ప్లీహము దెబ్బతింది.

Mahabubnagar: విద్యార్థిపై గంజాయి బ్యాచ్‌ దాడి

దారిలో అడ్డగించి డబ్బులివ్వాలని డిమాండ్‌

ఇవ్వకపోవడంతో మూకుమ్మడి దాడి.. దెబ్బతిన్న ప్లీహం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘటన

4 రోజులైనా నిందితుల్ని అరెస్టు చేయని పోలీసులు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాలమూరులో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో ఓ విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించడంతో బాధితుడి ప్లీహము దెబ్బతింది. జిల్లాలోని భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌కు చెందిన రైతు చిన్న నర్సింహులు కుమారుడు సాయికుమార్‌(19) నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తుంటాడు. 16న కాలేజీ నుంచి ముగ్గురుస్నేహితులతో కలిసి వెళుతుండగా అక్కడ గంజాయి తాగుతున్న ఐదారుగురు పోకిరీలు సాయికుమార్‌ను అడ్డుకొని డబ్బులు డిమాండ్‌ చేశారు. తన దగ్గర లేవని సాయి చెప్పడంతో రూ.40, రూ50 అయినా లేవా? అంటూ అతడిని ఇష్టానుసారంగా కొట్టారు. తీవ్రగాయాలైన సాయి, ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వెంటనే వారు, అతడిని నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తస్రావం జరుగుతుండటంతో స్కానింగ్‌ చేయగా ప్లీహము పూర్తిగా దెబ్బతిన్నట్లు తేలింది. ఆపరేషన్‌ చేసి ప్లీహము తొలగించారు. ప్రస్తుతం విద్యార్థి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. అయితే ప్లీహము నుంచే రోగనిరోధక శక్తి వస్తుందని, ఆ అవయవం లేకపోవడంతో ఏడాదికోసారి రోగనిరోధక శక్తి ఇంజెక్షన్‌, ప్రతి ఐదేళ్లకోసారి బూస్టర్‌ డోస్‌ను సాయికుమార్‌ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. దాడికి పాల్పడ్డ నిందితులు నేతల వద్ద పైరవీలు చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది.

Updated Date - Sep 21 , 2025 | 06:28 AM