Hostel Workers Forces Students to Cook: వారిది వేతన పోరాటం... వీరిది ఆకలి ఆరాటం
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:03 AM
గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వేతనాలు పెంచాలని దినసరి కూలీలు రెండు రోజులుగా సమ్మె చేస్తుండడంతో..
సమ్మెలో ఆశ్రమ పాఠశాల వర్కర్లు
వంటలు చేస్తున్న విద్యార్థినులు
వాంకిడి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వేతనాలు పెంచాలని దినసరి కూలీలు రెండు రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భోజనాలు వండటం, వడ్డించడం, పారిశుధ్య పనులు, గిన్నెలు శుభ్రం చేయటం, కూరగాయలు కోయడం వంటి పనులు విద్యార్థులే చేసుకుంటున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాల, కెరమెరి మండలంలోని మోడి బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న దినసరి కూలీలు సోమవారం సమ్మెలో ఉన్నారు. దీంతో విద్యార్థులు వండడం, పారిశుధ్య పనులు చేయడం, కూరగాయలు కోయడం, గిన్నెలు కడగడం వంటి పనులు చేశారు. విద్యార్థులే భోజనాలు వడ్డించుకున్నారు. రెగ్యులర్ వర్కర్లు ఒకరిద్దరు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు వారికి సాయం చేస్తున్నారు. వంటల పనుల్లో ఉన్న విద్యార్థులు పనులన్నీ ముగించుకొని పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 44 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు ఉండగా సుమారు 11,560 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.