Share News

Liquor Sales Timing: విచ్చలవిడి మద్యం విక్రయాలు వద్ద్దు

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:26 AM

లైసెన్స్‌ పేరుతో విచ్చలవిడిగా మద్యం విక్రయించకుండా చూడాలని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు కోరారు...

Liquor Sales Timing: విచ్చలవిడి మద్యం విక్రయాలు వద్ద్దు

  • సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకే విక్రయించాలి

  • మునుగోడు ఎమ్మెల్యే పేరిట కరపత్రం

నల్లగొండ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : లైసెన్స్‌ పేరుతో విచ్చలవిడిగా మద్యం విక్రయించకుండా చూడాలని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఈమేరకు నల్లగొండ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సంతో్‌షకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్‌ దుకాణాల నిర్మూలన ఉద్యమం చేపట్టి గ్రామాల్లో అవి లేకుండా చేశామన్నారు. ఇందులో భాగంగా కొత్తగా వైన్‌షాపులు దక్కించుకునే వారికి పలు సూచనలు చేస్తున్నామన్నారు. వైన్‌ షాపు ఊరి బయట ఉండాలని, దానికి అనుబంధంగా సిట్టింగ్‌ నడపకూడదని నిర్ణయించామన్నారు. బెల్ట్‌ దుకాణాలకు మద్యం విక్రయించొద్దని, మద్యం దుకాణాలు దక్కించుకున్న యజమానులు సిండికేట్‌ కాకూడదన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలని సూచిస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు దుకాణాల నిర్మూలన, మహిళల సాధికారతే తమ ఉద్దేశమన్నారు. ఈమేరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరిట ముద్రించిన కరపత్రాన్ని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సంతో్‌షకు అందజేశారు. ఇదే కరపత్రం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వాట్సాప్‌ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతోంది.

Updated Date - Oct 14 , 2025 | 02:26 AM