Share News

Chief Justice Justice Aparse Kumar Singh: ప్రజల నమ్మకాన్ని అనుసరిస్తూ సేవలందించాలి

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:55 AM

రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అనుసరిస్తూ సేవలు అందించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌సింగ్‌ చెప్పారు...

Chief Justice Justice Aparse Kumar Singh: ప్రజల నమ్మకాన్ని అనుసరిస్తూ సేవలందించాలి

  • వ్యవస్థలు ఎంత పటిష్ఠంగా ఉంటే దేశం అంతగా పురోగమిస్తుంది

  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్‌ వ్యాఖ్యలు

యాదాద్రి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అనుసరిస్తూ సేవలు అందించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌సింగ్‌ చెప్పారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉంటే దేశం అంతగా పురోగమిస్తుందన్నారు. జిల్లా ప్రజలకు ఒకేచోట అన్ని రకాల న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోక్సో, ఫ్యామిలీ కోర్టులను కలిపి 10ప్లస్‌2 కోర్టులతో నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ కె.సుజన, జస్టిస్‌ వి.రామకృష్ణారెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.

ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయసేవలు

నస్పూర్‌: ప్రజలకు న్యాయసేవలను ఒకే చోట అందించాలన్న లక్ష్యంతో భవన సముదాయాలను నిర్మిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో రూ.81 కోట్ల వ్యయంతో నిర్మించే జిల్లా కోర్టుల భవన సముదాయ నిర్మాణ పనులను శనివారం ఆయన హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు పూర్తయితే అన్ని రకాల న్యాయ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ నగేష్‌ భీమపాక ముఖ్య అథితిగా నస్పూర్‌కు హాజరై భూమి పూజ చేశారు.

Updated Date - Oct 12 , 2025 | 03:55 AM