kumaram bheem asifabad- మాస్టర్ పాన్ అమలుకు అడుగులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:23 PM
కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో మాస్టర్ ప్లాన్ అమలుకు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మున్సిపాల్టీల అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులతో చేపట్టిన అమృత్ 2.0 స్కీంలో కాగజ్‌నగర్ మున్సిపాల్టీ ఎంపిక కావటంతో గత ఏడాది డ్రోన్ ద్వారా సర్వేలను చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ మ్యాప్ రూపొందించారు. 2040 సంవత్సరంలో పెరుగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కావాల్సిన వసతులపై మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
- త్వరలోనే రాజకీయాల పార్టీల అభిప్రాయ సేకరణ
కాగజ్‌నగర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో మాస్టర్ ప్లాన్ అమలుకు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మున్సిపాల్టీల అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులతో చేపట్టిన అమృత్ 2.0 స్కీంలో కాగజ్‌నగర్ మున్సిపాల్టీ ఎంపిక కావటంతో గత ఏడాది డ్రోన్ ద్వారా సర్వేలను చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ మ్యాప్ రూపొందించారు. 2040 సంవత్సరంలో పెరుగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కావాల్సిన వసతులపై మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.నెల రోజుల క్రితం కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ మున్సిపల్ అధికారులతో మాస్టర్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ అమలుకు తీసుకోవాల్సిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ ప్రక్రియ తర్వాత నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. ఇది పూర్తయితే త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆయా రాజకీయా పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఆ తర్వాత రోడ్డు విస్తరణ ఎంత మేర చేపట్టాలి. కూడళ్ల విస్తరణ ఎంత ఉండాలి అనే అంశాలపై అధికారులు నివేదికలను రూపొందించనున్నారు.
- పూర్తయిన సర్వే..
ఈ ఏడాది జనవరిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా సర్వే చేశారు. దీన్ని ఆధారంగా పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం సర్వేలు చేసిన వాటిలో రద్దీ ఉండే ప్రదేశాలు, వార్డుల్లో అంతర్గత రోడ్ల వెడల్పు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మాస్టర్‌ప్లాన్ లేక పోవడంతో ప్రస్తుతం పట్టణం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. మార్కెట్‌లో రద్దీ ఎక్కువ అవుతోంది. పండుగల పూట మరింత సమస్య జఠిలంగా మారుతోంది. మార్కెట్‌లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ సమస్య పెరిగి పోతోంది. పట్టణంలోని ఇందిరా మార్కెట్‌లో నిత్యం లోడ్ లారీలు వివిధ సరుకులతో ఆన్‌లోడింగ్ వస్తాయి. దీంతో ఉదయం పూట కూరగాయాలు కూడా కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రోడ్లు కూడా పూర్తిగా గుంతలమయంగా మారడంతో నిత్యం వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌అమలు చేస్తే అన్ని సమస్యలు తీరే అవకాశాలున్నాయి. రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌చౌరస్తా, రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములుచౌరస్తా, ఎన్టీఆర్‌చౌరస్తా నుంచి చెక్ పోస్టు, లారీ చౌరస్తా నుంచి వినయ్‌గార్డెన్ సమీపం వరకు రోడ్లు అథోగతికి చేరుకున్నాయి. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిండి పోతుండడంతో ప్రమాదాల చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిత్యం ఆటోలు కూడా పద్ధతి ప్రకారం నిలుపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. పట్టణంలో పలు కాలనీల్లో ఇరుకు రోడ్లతో భారీ వాహనాలు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మాస్టర్ అమలుకు అధికారులు త్వరితగతిన తగినచర్యలు తీసుకుంటే బాగుంటుందని పట్టణ వాసులు చెబుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను వివరణ కోరగా మాస్టర్ ప్లాన్ అమలు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం పట్టణ సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలను పంపించామని తెలిపారు.