స్పిల్‌వే శాశ్వత మరమ్మతులకు చర్యలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:31 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేకు శాశ్వత మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని ఓఅండ్‌ఎం(ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్) ఈఎన్‌సీ శ్రీనివాస్ తెలిపారు.
ఓఅండ్‌ఎం ఈఎన్‌సీ శ్రీనివాస్
నాగార్జునసాగర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేకు శాశ్వత మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని ఓఅండ్‌ఎం(ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్) ఈఎన్‌సీ శ్రీనివాస్ తెలిపారు. సాగర్ ప్రాజెక్టు పరిశీలన భాగంగా గురువారం ఆయన సాగర్ ప్రధాన డ్యామ్, గ్యాలరీలు, క్రస్ట్ గేట్లు స్పిల్‌వే, ఎడమ కాల్వ, ఎర్త్ డ్యామ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్‌సీ శ్రీనివాస్ మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేకు శాశ్వత మరమ్మతుల కోసం ఇప్పటికే పలు కంపెనీలతో కలిసి పరిశీలించి చర్చించామని, ఏ ఒక్క కంపెనీ కూడా మరమ్మతులకు ముందుకు రాలేదన్నారు. ఇకపై ప్రతి ఏటా స్పిల్‌వేపై పడిన గుంతలను వెంటనే పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఏడాది మరమ్మతులు చేపట్టడానికి స్పిల్‌వే వద్ద అటు ఇటు కదిలే క్రేన్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గ్యాలరీలను పరిశీలించి గ్యాలరీలోని ప్లోరస్ హోల్స్‌లో (ఊటనీరు బయటకు వచ్చే మార్గం) పేరుకుపోయిన కాల్షియంను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రాజెక్టు నిర్వహణలో సమస్యలుంటే పరిష్కరిస్తాం
క్రస్ట్ గేట్లు ఎత్తడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రాజెక్టు ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో ఏ చిన్న సమస్య ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఏ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం విజయవిహార్ అతిథి గృహంలో ప్రాజెక్టు ఇంజనీర్లతో కలిసి సమీక్ష ఏర్పాటుచేశారు. ఈ సమీక్షలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిడమనూరు మండలం తుంగపాడు వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్, ఇంచార్జీ ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు, ఈఈలు వెంకటయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.