kumaram bheem asifabad- గిరిజన ఆవాసాల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:16 PM
గిరిజన ఆవాసాల అభివృద్ధికి పీఎం జుగా పథకం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని పంగిడిమాదర రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు
తిర్యాణి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఆవాసాల అభివృద్ధికి పీఎం జుగా పథకం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని పంగిడిమాదర రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా భీంజీగూడ అంగన్‌వాడీ కేంద్రం, పంగిడిమాదర సబ్ సెంటర్, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల కోసం ఐటీడీఏ ద్వారా పంపిణీ చేసిన భౌతిక, రసాయన శాస్త్రలకు సంబంధంచిన ప్రయోగశాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దేవాయిగూడెం గ్రామ పంచాయతీలలోని పీవీటీజీ కోలాం గిరిజనులు సుమారు 46 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబాటు తనాన్ని రూపు మాపి గిరిజనులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామీణ ఉత్కర్స్ అభియాన్(పీఎం జుగా) పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చిందన్నారు. గిరిజనులకు అవగాహన లేకుండా కోల్పోయిన వారి జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతాలను అందజేయనున్నామని తెలిపారు. గిరిజనులకు ఆధారాలను అందించడం కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పెరటి కోళ్ల పెంపకం, గొర్రెలు, మేకలు, చీమ పందుల ఫారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు ఎప్పుడు గిరిజనులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండలంలో 20 బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు నిర్మించినట్లు తెలిపారు. అతి త్వరలోనే వాటి సేవలు గిరిజనులకు అందిస్తామని తెలిపారు. మండలం లో ఇంకెక్కడైనా టవర్ అవసరం ఉంటే అధికారులు తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. కార్యకరమంలో డీటీడీవో రమాదేవి, ఎంపీడీవో మల్లేష్, ఐటీడీఏ జేఈ బద్రుద్దీన్, డీవో సిద్ధార్థ, ఏఈలు సువాస్, కృష్ణతేజ, వ్యవసాయాధికారి వినయ్‌రెడ్డి, వెటర్న రీ డాక్టర్ సాగర్, పీఎం జుగా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఎస్‌ఆర్పీ యశ్వంత్‌రావు, కళాకారులు, గ్రామపటేళ్లు తదితరులు పాల్గొన్నారు.