Share News

Minister Tummala Nagendra Rao: తేమ ఎక్కువున్న పత్తిని కూడా సీసీఐ కొనాలి

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:25 AM

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తేమశాతం ఎక్కువగా ఉన్న పత్తిని కూడా సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు...

Minister Tummala Nagendra Rao: తేమ ఎక్కువున్న పత్తిని కూడా సీసీఐ కొనాలి

  • రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను గుర్తించాలి

  • కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌కు తుమ్మల లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తేమశాతం ఎక్కువగా ఉన్న పత్తిని కూడా సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు సోమవారం లేఖ రాశారు. అయితే కేంద్రం నుంచి అనుమతి వచ్చే రైతులు ప్రస్తుత నిబంధనలు పాటించాలని, పత్తిలో తేమ 12శాతం మించకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని సూచించారు. పత్తి రైతులకు గరిష్ట మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. పత్తి అమ్మకం కోసం ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో రైతుల వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక అధికారుల బృందాలు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, ఏఈవోలు, మార్కెట్‌ కార్యదర్శులు, జిల్లా మార్కెటింగ్‌ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైనా, సందేహాలున్నా రైతులు టోల్‌ ఫ్రీ నెంబరు-1800 599 5779 కు ఫోన్‌ చేయాలని, మార్కెటింగ్‌ అధికారులు సహకరిస్తారని నాగేశ్వరరావు చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రైస్‌ సపోర్ట్‌ స్కీమ్‌(పీఎ్‌సఎస్‌) కింద ఉన్న పంటల కొనుగోలుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పండే పెసర, మినుములను మొత్తం, సోయాబీన్‌ ఉత్పత్తిలో 50 శాతం వరకు.. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, జొన్న పంటలను ప్రైస్‌ సపోర్టు స్కీమ్‌లో చేర్చాలన్నారు. ఈ ఖరీ్‌ఫలో మక్కల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. యాసంగిలో జొన్న రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రూ.520కోట్లు వెచ్చించి పంట కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం మొక్కొజొన్న, జొన్న సేకరణతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.3 వేల కోట్ల భారం పడుతోందన్నారు. అందువల్ల మొక్కజొన్న, జొన్న పంటలను ప్రైస్‌ సపోర్టు స్కీమ్‌లో చేర్చాలని మంత్రి కోరారు. తుమ్మల విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రమంత్రి శివరాజ్‌... ప్రైస్‌ సపోర్ట్‌ స్కీమ్‌ కింద ఉన్న పెసర, మినుము, సోయాబీన్‌ కొనుగోళ్లకు రెండు, మూడు రోజుల్లో అనుమతులిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Oct 28 , 2025 | 04:25 AM