Minister Tummala: పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెరగాలి
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:40 AM
నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు...
అధిక దిగుబడినిచ్చే వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలి
కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు గత సర్కారు మొండి చేయితో రైతులకు రూ.3000 కోట్లు నష్టం
రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నూనె గింజలతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 21న జరిగే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పప్పు దినుసుల్లో అధిక దిగుబడినిచ్చే వంగడాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది యాసంగిలో రూ.2.68 కోట్ల సబ్సిడీతో 14 జిల్లాల్లో 19,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. 84 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు, 74 క్వింటా ళ్ల కుసుమలతోపాటు శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, ఇందుకు రూ.45.41 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రూ.48.54 కోట్లతో 2025-26 సంవత్సరంలో జాతీయ ఆహార భద్రత పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విత్తనాలతోపాటు ప్రదర్శనా క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయ న పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు జాతీ య నూనె గింజల మిషన్, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను చేపడుతున్నామన్న మంత్రి తుమ్మల.. ఇప్పటికే యాంత్రీకరణ లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాధనంతో అమల్యే పథకాలు ఒక్కొక్కటి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో పదేళ్లలో అన్నదాతలు సుమారు రూ.3,000 కోట్లు నష్టపోయారని తుమ్మల వ్యాఖ్యానించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తిగా వాడుకునేందుకు రాష్ట్రం వాటా నిధులను విడుదల చేసి, రైతుల ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రస్తుతం వానాకాలం పంట ఉత్పత్తుల సేకరణకు ప్రాధాన్యం ఇస్తూనే.. యాసంగిలో అమలు చే యాల్సిన పథకాలపై దృష్టి సారించామని చెప్పారు. గత సీజన్‌లో ఒక్కో జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 1.39 లక్షల మట్టి నమూనాలు సేకరించగా, మరో 1.70 లక్షల నమూనాలు విశ్లేషణ దశలో ఉన్నట్లు తెలిపారు. సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు క్లస్టర్ల గుర్తింపు, రైతుల శిక్షణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.