Share News

Ponguleti Srinivas Reddy: అప్పులకుప్పలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం

ABN , Publish Date - Sep 25 , 2025 | 05:07 AM

గత ప్రభుత్వం అప్పులకుప్పగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లక్షలాది మంది పేదలకు....

Ponguleti Srinivas Reddy: అప్పులకుప్పలా మారిన  రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం

  • పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు.. రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం రూరల్‌/అశ్వారావుపేట, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం అప్పులకుప్పగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లక్షలాది మంది పేదలకు గత ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తోందన్నారు. ఇల్లు పూర్తయిన వారం రోజుల్లోనే బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. బుధవారం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో పొంగులేటి పర్యటించారు. తొలుత ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం రూ.15 కోట్లతో నిర్మించనున్న 9,700 మెట్రిక్‌ టన్నుల శీతల గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతును రాజు చేయడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల యూరియా సమస్య ఏర్పడితే ఢిల్లీలో రైతుల పక్షాన పోరాటం చేశామన్నారు. రాబోయే వారంరోజుల్లో యూరియా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు. అనంతరం ఆరెంపుల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షలు ఇళ్లు మంజూరు చేశామని, వచ్చే మూడేళ్లలో దశలవారీగా అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు. 11 లక్షల రేషన్‌ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు ఇంట్లో పొంగులేటి భోజనం చేశారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఆత్మ కమిటీ చైర్మన్‌ సుంకవల్లి వీరభద్రరావు, సభ్యుల ప్రమాణీ స్వీకార కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. భద్రాద్రి కలెక్టర్‌ జితేష్‌ వీ పాటిల్‌ పలువురు అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 05:07 AM