Minister Tummala Nageswara Rao: రాష్ట్రాల అధికారాలను హరించేలా విత్తన బిల్లు
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:40 AM
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విత్తన బిల్లు- 2025 ముసాయిదా రాష్ట్రాల అధికారాలను హరించేలా ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు....
విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రాష్ట్ర మంత్రి తుమ్మల
నకిలీ విత్తనాల నియంత్రణ, సర్టిఫికేషన్ అధికారాలు రాష్ట్రాలకు ఉండాలని వ్యాఖ్య
హైదరాబాద్, రాజేంద్రనగర్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విత్తన బిల్లు- 2025 ముసాయిదా రాష్ట్రాల అధికారాలను హరించేలా ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. నకిలీ విత్తనాల నియంత్రణ, సర్టిఫికేషన్‌పై అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన బిల్లుపై శుక్రవారం జరిగిన సదస్సులో మంత్రి తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం పూర్తి బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, ప్రతిపాదిత చట్టంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం ఆందోళనకరమని తుమ్మల అన్నారు. విత్తనాల రిజిస్ట్రేషన్ నుంచి లైసెన్సింగ్ వరకు, మార్కెట్ నియంత్రణ నుంచి నాణ్యత పర్యవేక్షణ వరకు అన్నింటినీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలనే ధోరణి కనిపిస్తున్నదని తెలిపారు. విత్తనాల నాణ్యతపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే సామర్థ్యం రాష్ట్ర యంత్రాంగానికే ఉందని, అందువల్ల విత్తన సర్టిఫికేషన్ అధికారం రాష్ట్రాలకే ఉండాలని స్పష్టం చేశారు. విత్తన కంపెనీల కోసం విత్తనోత్పత్తి చేసేటప్పుడు రైతులకు నష్టం వాటిల్లితే పరిహారం ఇచ్చేలా చట్టం చేయాలన్నారు. విదేశీ విత్తనాలను పరీక్షించి దేశీయంగా సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే రైతులకు విక్రయించేలా ముసాయిదాలో మార్పులు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల నియంత్రణ, విత్తనాల సర్టిఫికేషన్ అధికారాలు రాష్ట్రానికే ఉండాలని అన్నారు. ఈ ముసాయిదా చట్టంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శాసనసభలో చర్చింస్తామని, పార్లమెంట్‌లోనూ వాదనలు వినిపిస్తామని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా విత్తన చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని, అందరి అభిప్రాయాలతో డిసెంబరు తొలి వారంలో కేంద్రానికి లేఖలు పంపుతామని చెప్పారు. ఇక, రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా కేంద్ర ఒక మోడల్ చట్టాన్ని తీసుకురావాలని, రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చట్టం రూపొందించుకునే అవకాశం ఉండాలని వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జానయ్య అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11,12 తేదీల్లో నిర్వహించనున్న మెగా రైతు మేళా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమతి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్ర విత్తనాభివృద్థి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.