Share News

Telangana State Consumer Forum: విద్యా రుణం విషయంలోబ్యాంక్‌కు చుక్కెదురు

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:41 AM

ఓ విద్యా రుణానికి సంబంధించిన బీమా వ్యవహారాన్ని నిర్వహించడంలో యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొంటూ బ్యాంకు...

Telangana State Consumer Forum: విద్యా రుణం విషయంలోబ్యాంక్‌కు చుక్కెదురు

  • యూనియన్‌ బ్యాంకు అప్పీలును కొట్టేసిన రాష్ట్ర వినియోగదారుల ఫోరం

  • రుణబీమా విషయంలో బ్యాంకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తీర్పు

  • జిల్లా ఫోరం తీర్పును యథాతథంగా అమలుచేయాలని ఆదేశం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఓ విద్యా రుణానికి సంబంధించిన బీమా వ్యవహారాన్ని నిర్వహించడంలో యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొంటూ బ్యాంకు అప్పీలును రాష్ట్ర వినియోగదారుల ఫోరం తిరస్కరించింది. విద్యా రుణంలో బకాయి మొత్తాలను రద్దు చేయడంతో పాటు రుణగ్రహీత తల్లిదండ్రులకు రూ.50 వేల పరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.20 వేలను ఆదేశాలు అందుకున్న నాటి నుంచి 45 రోజుల్లోగా చెల్లించాల్సిందిగా గతంలో జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, యూఎ్‌సలో ఉన్నత విద్యనభ్యసించడం కోసం లతిక శ్రీదత్త నంబూరి అనే విద్యార్థి 2011లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద రూ.10 లక్షల విద్యా రుణం తీసుకున్నారు. ఆ మొత్తం రుణంపై జీవిత కాలానికి బీమా కూడా తీసుకున్నారు. ఆ సమయంలో అతడి తల్లిదండ్రులు తమ ఇంటిని సెక్యూరిటీగా చూపించారు. ఈ నేపథ్యంలో 2016లో అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో శ్రీదత్త మృతి చెందారు. దీంతో రుణాన్ని బీమా ద్వారా క్లెయిమ్‌ చేయాలని బ్యాంకును విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. దానికి ఒప్పుకోని బ్యాంకు, బీమా గడువు 2014లోనే ముగిసిందని, తిరిగి రెన్యూవల్‌ చేయకపోవడంతో రుణం మొత్తాన్ని చెల్లించాలని లేకపోతే హామీగా పెట్టిన తమ ఇంటిని జప్తు చేస్తామని తెలిపింది. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. రుణం మొత్తాన్ని రద్దు చేయాల్సిందిగా ఫోరం తీర్చు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ బ్యాంకు, రాష్ట్ర ఫోరంను ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర ఫోరం తీర్పునిస్తూ.. బ్యాంకు 2005లో జారీ చేసిన సర్క్యూలర్‌ ప్రకారం రుణానికి బీమా కవరేజీ జీవిత కాలానికి ఉండాలి, కానీ వినియోగ దారులకు తెలియకుండా దానిని బ్యాంకు మూడు సంవత్సరాలకు పరిమితం చేసిందని పేర్కొంది. బ్యాంకు పత్రాల్లో రుణానికి సంబంధించిన వివరాలు పూర్తిగా లేవని, పాలసీ కాపీని కూడా రుణగ్రహితలకు బ్యాంకు అందజేయలేదని పేర్కొంది. దీంతో పాలసీ 2014లోనే ముగిసిందని బ్యాంకు చేసే వాదనలు చెల్లవని పేర్కొంటూ.. ఇలాంటివి రుణ వసూళ్ల వివాదాల కిందికి కాకుండా సేవల లోపం కిందికి వస్తాయని తెలిపింది. బ్యాంకు అప్పీలును కొట్టివేస్తూ.. జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది.

Updated Date - Oct 28 , 2025 | 04:41 AM