kumaram bheem asifabad- ప్రమాణమే ప్రధానం
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:04 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పదవీ ప్రమాణక్వీకారం ఎంతో ప్రధానమైనది. గెలుపొందిన వారు పదవీ ప్రమాణం చేస్తేనే సాంకేతికంగా అధికారాన్ని పొందుతారని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చెబుతోంది. మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో అదే రోజున ఓట్లు లెక్కింపు అనంతరం గెలిచిన రోజునే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు అప్పటికప్పుడే వారు ఎన్నికైన ట్లుగా రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాలను అభ్యర్థులకు అందజేశారు.
వాంకిడి/బెజ్జూరు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పదవీ ప్రమాణక్వీకారం ఎంతో ప్రధానమైనది. గెలుపొందిన వారు పదవీ ప్రమాణం చేస్తేనే సాంకేతికంగా అధికారాన్ని పొందుతారని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం చెబుతోంది. మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో అదే రోజున ఓట్లు లెక్కింపు అనంతరం గెలిచిన రోజునే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు అప్పటికప్పుడే వారు ఎన్నికైన ట్లుగా రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాలను అభ్యర్థులకు అందజేశారు. కానీ ఈ ధ్రువీకకరణ పత్రం వారు గెలిచినట్లుగా గుర్తింపుగా మాత్రమే పనికి వస్తాయి తప్ప వీటితో సాంకేతికంగగా అధికారం వారికి రాదు. ఇందుకోసం పంచాయతీ రాజ్ చట్టంలో అధికార బదిలీకి కొన్ని నిబంధనలు రూపొందించారు. తొలుత గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏజెండాతో కూడిన రిజస్టరును గెలుపొందిన వారి ఇంటికి పంచాయతీ కార్యదర్శి పంపించి సంతకాలు చేయిస్తారు. పంచాయతీ కార్యాలయంలో పాలక మండలి ప్రమాణస్వీకారం అనంతరం తొలి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సదరు రిజిస్టర్‌లో పొందు పరుస్తారు. ప్రమాణస్వీకారం రోజున ప్రభుత్వం నుంచి వచ్చే ప్రమాణపత్రంలోని సమాచారాన్ని గెలిచిన వారితో పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి చదివించి ప్రమాణం చేయిస్తారు. అనంతరం సమావేశ హాజరు రిజిష్టరులో సంతకం చేయడం ద్వారా సాంకేతికంగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు అధికారాలు వస్తాయి. ఆ తర్వాత తొలిపాలకమండలి సమావేశ మినిట్స్, తీర్మానం రిజిష్టర్లో సంతకాలు చేస్తారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింత్ చెక్‌పవర్‌ను అందించేందుకు నమూనా(స్పెసిమెన్) సంత కాలను తీసుకొని ఎస్‌టీవో, బ్యాంకు, ఎంపీడీఓ కార్యాలయాలకు పంపిస్తారు. ఒకవేళ ప్రమాణస్వీకారానికి సర్పంచ్ అందుబాటులో లేనప్పటికి వచ్చిన వారు సంతకాలు చేసి తర్వాత సర్పంచ్ సంతకం చేస్తారు. మూడు విడతల్లో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నందున ఆ రోజు నుంచే పాలకమండలి అధికారంలోకి వచ్చినట్లుగా ఐదేళ్ల పదవికాలాన్ని లెక్కిస్తారు.