Share News

రోడ్డెక్కుతున్న మెట్లు!

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:53 AM

ఎవరూ ఏమీ అనకపోతే రోడ్డు మీద కూడా ఇళ్లు కట్టేలా ఉన్నారు నీలగిరిలో కొంతమంది. గజం జాగా అదనంగా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే అది రోడ్డు అయినా సరే ఆక్రమించి నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు.

 రోడ్డెక్కుతున్న మెట్లు!
నల్లగొండ పట్టణంలోని ఓ కాలనీలో ఏర్పాటు చేసిన ర్యాంపు

రోడ్డెక్కుతున్న మెట్లు!

రోడ్డు సగం వరకు వస్తున్న ర్యాంపులు

ఇరుకుగా మారుతున్న రహదారులు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

చోద్యం చూస్తున్న మునిసిపల్‌ అధికారులు

రామగిరి, జూన 22 (ఆంధ్రజ్యోతి): ఎవరూ ఏమీ అనకపోతే రోడ్డు మీద కూడా ఇళ్లు కట్టేలా ఉన్నారు నీలగిరిలో కొంతమంది. గజం జాగా అదనంగా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే అది రోడ్డు అయినా సరే ఆక్రమించి నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. మరికొంతమంది అయితే అవకాశం ఉంది కదా, ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తలేవు కదా... అధికారులు కూ డా ఏమి అనట్లేదు కదా అనుకొని రోడ్డు సగం వరకు ర్యాంపులు ఏర్పాటు చేసుకొని తమ ఇం టిని పొడిగించుకొని నిర్మాణాలు చేస్తున్నారు. ఇలా రోడ్డును ఆక్రమించి ర్యాంపులు ఏర్పాటు చేసుకున్న వారిపై మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదులు చేస్తే ఆయా గృహ నిర్మాణాదారులు తమపై గొడవ చేస్తారన్న భయంతో స్థానిక వీధి వాసులే కొంతమంది ఉండగా, పోయేది నా జాగా కాదు కదా నాకేందుకు లే అని చూస్తూ వెళ్తున్న వారు మరికొంతమంది. ఫలితంగా రోడ్డు ఇరుకుగా మారుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఇరుకుగా మారుతున్న రోడ్లు...

నల్లగొండ పట్టణంలో హనుమాన నగర్‌ రోడ్డు నెంబర్‌-2, పాతబస్తీ సిమెంట్‌ రోడ్డు, గాంధీనగర్‌, రవీంద్రనగర్‌లో గల న్యూస్‌ స్కూల్‌ సమీపంతో పాటు, మిర్యాలగూడ, దేవరకొండ రోడ్డులో గల పలు వీఽధుల్లో కొంతమంది రోడ్డును ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహ నిర్మాణదారులు రోడ్డు సగం వరకు ఆక్రమించి ర్యాంపులు (మెట్లు) నిర్మిస్తున్నారు. ఫలితంగా ఆయా విధులు ఇరుకుగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ర్యాంపు ఉన్న ఇంటిని దాటి కారు లాంటి వాహనం వెళ్లాలంటే అతి కష్టం మీద వెళ్లాల్సిన పరిస్థితి. ఒక్కోసారి కొన్ని వీధుల్లో ద్విచక్ర వాహనదారులు పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజాప్రతినిధులు చూస్తున్నా తమ ఓటు బ్యాంకు కోసం మిన్నకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే మునిసిపల్‌ వార్డు అధికారుల అలసత్వం కూడా ఉన్నట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఏదిఏమైనా రోడ్డు, మునిసిపల్‌ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యంగానే ఇలాంటి ఆక్రమణలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలకు జరిగినట్లు రుజువైతే సుమోటోగా తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలిగించాలని కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం

రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. అలాంటి నిర్మాణాలను తమ సిబ్బందితో గుర్తించి మొదటగా ఆయా యజమానులకు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచిస్తాం. అప్పటికి తొలగించుకోకపోతే తమ సిబ్బందితో ఎక్స్‌కవేటర్‌తో తొలగింపజేస్తాం.

సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌, నల్లగొండ

Updated Date - Jun 23 , 2025 | 12:53 AM