Share News

Staff Shortage: అంగన్‌వాడీలకు సిబ్బంది కొరత

ABN , Publish Date - Sep 07 , 2025 | 07:09 AM

రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయా, టీచర్‌ పోస్టులను రెండేళ్లుగా భర్తీ చేయడంలేదు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 4 నెలల క్రితం ఆమోదం తెలిపినా ఇంకా ముందడుగు పడలేదు.

Staff Shortage: అంగన్‌వాడీలకు సిబ్బంది కొరత

  • ఖాళీగా ఆయా, టీచర్‌ పోస్టులు

  • రాష్ట్ర వ్యాప్తంగా 14,236 ఖాళీలు

  • పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఇబ్బందులు

  • భర్తీకి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆమోదం

  • అయినా ముందుకు కదలని ప్రక్రియ

  • రెండేళ్లుగా నిరుద్యోగుల నిరీక్షణ

పెద్దపల్లి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయా, టీచర్‌ పోస్టులను రెండేళ్లుగా భర్తీ చేయడంలేదు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 4 నెలల క్రితం ఆమోదం తెలిపినా ఇంకా ముందడుగు పడలేదు. సిబ్బంది కొరతతో ఆ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక టీచర్‌, ఒక ఆయా ఉంటారు. ఈ కేంద్రాల ద్వారా ఆరేళ్లలోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు ఒక పూట పౌష్టికాహారాన్ని అందిస్తారు. పలు చోట్ల ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పక్క గ్రామాల్లోని కేంద్రాల టీచర్లు, ఆయాలకు బాధ్యత అప్పగించారు. పని భారం పెరగడంతో వారు విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల్లో 6,399, ఆయా పోస్టుల్లో 7,837 ఖాళీలున్నాయి. మొత్తం 14,236 ఖాళీలున్నాయి. వీటి భర్తీపై ఎంతో మంది నిరుద్యోగ యువతులు ఆశలు పెంచుకున్నారు. టీచర్‌ పోస్టుకు ఇంటర్‌ ఉత్తీర్ణత, ఆయా పోస్టులకు కనీసం 7వ తరగతి చదివి ఉండాలనే నిబంధన ఉంది. జూన్‌లోనే స్త్రీ శిశు సంక్షేమ శాఖ 14,236 టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆమోదం తెలిపినప్పటికీ, సాంకేతిక అవరోధాల కారణంగా చేయడం లేదని తెలుస్తున్నది. ఖాళీలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయని, పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని, స్థానికులకే పోస్టుల భర్తీకి అవకాశం ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం, సంబంధిత మంత్రి స్పందించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ యువతులు, మహిళలు కోరుతున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 07:11 AM