Share News

Staff Guard Booked for Abuse: జువెనైల్‌ హోంలో దారుణం

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:33 AM

సైదాబాద్‌లోని జువెనైల్‌ హోంలో ఓ బాలుడిపై స్టాఫ్‌గార్డ్‌ (సూపర్‌వైజర్‌) పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడి ద్వారా విషయం తెలియడంతో అతడి తల్లి ....

Staff Guard Booked for Abuse: జువెనైల్‌ హోంలో దారుణం

  • బాలుడిపై స్టాఫ్‌గార్డ్‌ అఘాయిత్యం.. సైదాబాద్‌లో ఘటన

  • పోలీసులకు బాధితుడి తల్లి ఫిర్యాదు

  • లైంగిక దాడి వాస్తవమే.. స్పష్టం చేసిన విచారణ అధికారి

  • మరికొందరు బాలురపైనా దారుణం?

  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సైదాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): సైదాబాద్‌లోని జువెనైల్‌ హోంలో ఓ బాలుడిపై స్టాఫ్‌గార్డ్‌ (సూపర్‌వైజర్‌) పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడి ద్వారా విషయం తెలియడంతో అతడి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జువెనైల్‌ హోంలో బాధిత బాలుడు 2024 సెప్టెంబరు నుంచి ఉంటూ చదువుకుంటున్నాడు. దసరా సెలవులు రావడంతో అధికారుల అనుమతితో తల్లి ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్లింది. పండుగ తర్వాత కుమారుడిని జువెనైల్‌ హోంకు పంపేందుకు ఏర్పాట్లు చేయగా బాలుడు వెళ్లేందుకు నిరాకరించాడు. తల్లి నిలదీయగా .. జువెనైల్‌ హోంలోని స్టాఫ్‌గార్డ్‌ రెహమాన్‌(27) తనపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని చెప్పుకొని ఏడ్చాడు. గత మార్చిలో హోంలోని మూడో అంతస్తు గదిలోకి తనను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఘటన గురించి బయటచెబితే హాని తలపెడతానని బెదిరించాడని, ఆ నెలలోనే తనపై నాలుగైదుసార్లు లైంగికదాడి చేశాడని వివరించాడు. కుమారుడిని వెంటబెట్టుకొని ఆ తల్లి శనివారం రాత్రి సైదాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. కాగా నిందితుడు.. ఆ జువెనైల్‌ హోంలో మరికొంత మంది బాలురపై లైంగిక దాడులు చేశాడన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు.. జువెనైల్‌ హోంలో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడతామని సూపరింటెండెంట్‌ అఫ్జల్‌ పేర్కొన్నారు. హోంలో తరచూ జ్యుడిషయల్‌ ఆఫీసర్లు, సీడబ్ల్యూసీ సభ్యులు, ఎన్‌జీవోలు వచ్చి కౌన్సెలింగ్‌ ఇస్తుంటారని, బాలలతో విడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. వారికి చెప్పుకోవడం ఇష్టంలేని బాధితుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ బాక్స్‌ ఏర్సాటు చేస్తామని, దాని ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. తనపై జరిగిన లైంగికదాడికి గురించి బాలుడు.. మరో ముగ్గురు పిల్లలకు చెప్పాడని.. ఆ పిల్లల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారని వెల్లడించారు. బాధితుడిపై లైంగికదాడి జరిగినట్లు పోలీసులకు ఆ పిల్లలు తెలియజేశారని వెల్లడించారు.

లైంగిక దాడి వాస్తవమే: మైథిలీ, విచారణాధికారి

జువెనైల్‌ హోంలో బాలుడిపై జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని.. ఘటనపై ఉన్నతాధికారులు తనను విచారణాధికారిగా నియమించినట్లు నింబోలిఅడ్డ ప్రభుత్వ బాలికల గృహం సూపరింటెండెంట్‌ మైఽథిలీ తెలిపారు. ఇప్పటికే హోం సిబ్బంది, పిల్లలతో మాట్లాడి నివేదిక తయారుచేసి అధికారులకు అందజేశామని చెప్పారు. నిందితుడిపై చర్యలు ఉంటాయని అన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 02:33 AM