Share News

Srisailam Dam: డేంజర్‌లో శ్రీశైలం డ్యాం!

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:49 AM

కృష్ణానదిపై శ్రీశైలం వద్ద నిర్మించిన ఆనకట్టకు ప్లంజ్‌పూల్‌ రంధ్రం ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది...

Srisailam Dam: డేంజర్‌లో శ్రీశైలం డ్యాం!

  • ఆనకట్టవైపు దూసుకొస్తున్న ప్లంజ్‌పూల్‌ రంధ్రం

  • ప్లంజ్‌పూల్‌ వద్ద 45 మీటర్ల మేర భారీ గొయ్యి

  • ఆనకట్ట భద్రతపై నిపుణుల కమిటీ ఆందోళన

  • అధ్యయన నివేదికను వెల్లడించిన కమిటీ

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్ర జ్యోతి): కృష్ణానదిపై శ్రీశైలం వద్ద నిర్మించిన ఆనకట్టకు ప్లంజ్‌పూల్‌ రంధ్రం ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన ప్లంజ్‌పూల్‌ ప్రమాదకరంగా మారిందని, ఆ ప్రాంతంలో భారీగా ఏర్పడిన గొయ్యి డ్యాం భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన అండర్‌ వాటర్‌ పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన అధ్యయన నివేదికను వెల్లడించింది. డ్యాం నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల నీరు వేగంగా పడటం వల్ల ఆ ఒత్తిడికి ఫ్లంజ్‌పూల్‌ 35-45 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడినట్లు గుర్తించారు. ఇది అప్రాన్‌ ముగిసిన 15 మీటర్ల తరువాత మొదలై.. సుమారు 150 మీటర్ల వరకు విస్తరించినట్లు నిపుణులు వెల్లడించారు. దీని వల్ల 36 మీటర్ల వెడల్పు ఉన్న అప్రాన్‌కు ముప్పు ఏర్పడిందని, దాని కింద 4 మీటర్ల లోతు రంధ్రం ఉందని కమిటీ పేర్కొంది. ఈ రంధ్రం డ్యాంవైపు 14-15 మీటర్ల మేర విస్తరించి ఉండటంతో కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అప్రాన్‌ వెడల్పులో సుమారు సగభాగం ఎలాంటి మద్దతు లేకుండా గాల్లో వేలాడుతున్నట్లు ఉందని పేర్కొంది. రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్టీల్‌ సిలిండర్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. అప్రాన్‌ను కాపాడేందుకు గతంలో ఏర్పాటు చేసిన 62 సిలిండర్లలో అనేకం దెబ్బతిన్నాయని గుర్తించారు. ఇప్పటికే ఐదు సిలిండర్లు వరదలో కొట్టుకుపోయాయని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ గతంలో ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

డ్యాం పునాదులకంటే ఎక్కువ లోతు

2018లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ చేసిన అధ్యయనంలో వాయిడ్‌ లోతు 32 మీటర్లు ఉన్నట్లు గుర్తించింది. అది ఆనకట్ట పునాది లోతును మించి పోయిందని తెలిపింది. ఇప్పుడు 45 మీటర్లకు చేరడంతో పరిస్థితి ఆందోళనకరమని పేర్కొంది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సీలైన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఇచ్చిన 200 పేజీల అధ్యయన నివేదికలో పలు హెచ్చరికలు చేసింది. డ్యాంకు తక్షణ మరమ్మతులు అవసరమని సిఫార్సు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉందని సిఫార్సు చేసింది.

Updated Date - Dec 05 , 2025 | 02:49 AM