Heavy Rain in Hyderabad: మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం, సాగర్ గేట్లు హైదరాబాద్‌లో భారీ వర్షం
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:55 AM
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది...
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. దీంతో అధికారులు ఆరు గేట్లను తెరిచి 1,68,174 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 65,640 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు 22 గేట్ల నుంచి నీటిని వదులుతున్నారు. వరద తగ్గడంతో ఈ నెల 5న గేట్లు మూసివేయగా మళ్లీ పెరగడంతో మంగళవారం గేట్లు ఎత్తారు. సాగర్ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రానికి 311.1 టీఎంసీల నీరు ఉంది. మొత్తం 2,29,422 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి 2,29,422 క్యూసెక్కుల నీరు చేరుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లక్డీకపూల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట ప్రాంతాల్లో కురిసిన కుండపోతతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లక్డీకపూల్ ప్రధాన రహదారిలో మోకాలిలోతున నీరు నిలిచిపోవడంతో ద్విచక్రవాహనాలు, కార్లు సగానికిపైగా నీట మునిగాయి. ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం రాత్రి 7 గంటల వరకు బహుదూర్‌పురలో అత్యధికంగా 5.7 సెం.మీ, బండ్లగూడ కందికల్‌గేట్‌లో 6.6 సెం.మీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు నగరంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నల్గొండ జిల్లా కనగల్‌లో అత్యధికంగా 11 సెం.మీ వర్షపాతం నమోదైంది.