Road Accident: గుడిసెలోకి దూసుకువెళ్లిన ఇన్నోవా
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:23 AM
డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగం వెరసి రోడ్డు పక్కన ఓ గుడిసెలో నిద్రిస్తున్న కుటుంబాన్ని బలిగొంది. స్వెటర్లు, రగ్గులు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబానికి..
మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం
డ్రైవర్ అతివేగానికి ఓ కుటుంబం బలి
నిద్రిస్తున్న సమయంలోనే ప్రమాదం
తండ్రీకొడుకుల మృతి
మరొకరికి తీవ్రగాయాలు
రాజేంద్రనగర్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగం వెరసి రోడ్డు పక్కన ఓ గుడిసెలో నిద్రిస్తున్న కుటుంబాన్ని బలిగొంది. స్వెటర్లు, రగ్గులు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబానికి.. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసె వారి విశ్రాంతి స్థలం. బుధవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలోనే.. అతివేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు గుడిసెను బలంగా ఢీకొట్టడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకులు మృతిచెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రభు మహారాజ్(60) తన ఇద్దరు కుమారులు దీపక్, సాధునాథ్‌లతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. కాటేదాన్ దుర్గానగర్ చౌరస్తా సమీపంలో రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకుని.. అక్కడే స్వెటరు,్ల రగ్గులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం శంషాబాద్ నుంచి సంతో్‌షనగర్‌కు వెళ్తున్న ఇన్నోవా కారు.. నియంత్రణ కోల్పోయి మహారాజ్ కుటుంబం నిద్రిస్తున్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దీపక్ (25) అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతని తండ్రి ప్రభు మహరాజ్ మరణించాడు. ప్రమాద సమయంలో కారును నడుపుతున్న సయ్యద్ హుస్సేన్‌తో పాటు అందులో ఉన్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరూ శుభకార్యాలలో బౌన్సర్లుగా పనిచేస్తారని తెలిసింది. శంషాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి బౌన్సర్లుగా వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.