Forum for Good Governance: అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:49 AM
అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ కేసుల్లో చిక్కుకున్న ఉద్యోగులు, అధికారులకు త్వరితగతిన శిక్షపడేలా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎఫ్‌జీజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది...
సీఎంకు ఎఫ్‌జీజీ లేఖ
అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) కేసుల్లో చిక్కుకున్న ఉద్యోగులు, అధికారులకు త్వరితగతిన శిక్షపడేలా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మధ్య ఏసీబీ అధికారులు పెద్దఎత్తున అవినీతి కేసులను నమోదు చేస్తున్నారని ఎఫ్‌జీజీ లేఖలో పేర్కొంది. 2011, 2012లలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం 67 మంది రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసిందని వివరించింది. వీరిలో ఇద్దరిపై విచారణ పూర్తయి, నిర్దోషులుగా తేలారని, మిగతా 65 మందిపై 13 ఏళ్లుగా కేసులు పెండింగులోనే ఉన్నాయని తెలిపింది. ఇలాంటి చాలా కేసులు సచివాలయంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొన్నది. కేసులు తేలడానికి 10-12 ఏళ్ల కాలం పడుతోందని వెల్లడించింది. అందుకే అవినీతి కేసులు రెండు మూడేళ్లలో తేలిపోయి, దోషులకు శిక్ష పడేలా చూడాలని సీఎంను ఎఫ్‌జీజీ కోరింది.