శివకేశవులకు విశేష పూజలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:30 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి.
యాదగిరిగుట్ట, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వామిఅమ్మవారికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, పర్వత వర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్ర రీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానా లయంలో సుప్రభాత సేవతో స్వామి అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు మూల మూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళా లతో అర్చించారు. సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సా యంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్ర నామార్చనలు ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయంలోని ముఖమండపంలో స్ఫటికమూర్తులను అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషే కించారు. వివిధ విభాగాల ద్వారా ఖజానాకు రూ.23,94,907 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు.
కొనసాగిన భక్తుల రద్దీ
మూడు రోజుల(శుక్ర, శని, ఆదివారం) సెలవులు కావడంతో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనం రెండు గంటలు, మధ్యాహ్నం ఆరగింపు గంట సమయం కలుపుకొని మూడు గంటల పాటు ఉభయ క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉన్నారు. రాత్రి వరకు రద్దీ కొనసాగింది.ప్రత్యేక దర్శనానికి అర్ధగంట, ధర్మదర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 23వేల మంది దర్శించుకున్నారు. కొండపైన బస్టాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన భక్తుల మధ్య బస్సు ఎక్కేటప్పుడు స్వల్ప వాగ్వాదం జరిగింది.
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆలయంలో సోమవారం విశేష అర్చనలు జరిగాయి. ఆలయంలో ప్రాత:కాలార్చనలు పూర్తయాక అర్చకులు మూలవర్యులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి సహస్ర నాగవల్లీ దళార్చన జరిగింది. ఉదయం 9:30గంటలకు లక్ష్మీనృసింహుడి పరిణయోత్సవ క్రతువు ప్రారంభమైంది. శ్రీదేవి, భూదేవి సమేత మట్టపల్లి లక్ష్మీనరసింహుడి మూర్తులను కల్యాణ వేదికపై అధిష్ఠింపజేసి విష్వక్ష్సేనారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో సరికొండ నవీన్ ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.