Share News

kumaram bheem asifabad- విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:26 PM

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. వసతి గృహంలో కలెక్టర్‌ నిద్ర కార్యక్రమంలో భాగంగా గురువారం గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి వసతి గృహంలో నిద్రించారు.

kumaram bheem asifabad- విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిద్రిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

రెబ్బెన, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. వసతి గృహంలో కలెక్టర్‌ నిద్ర కార్యక్రమంలో భాగంగా గురువారం గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి వసతి గృహంలో నిద్రించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కలెక్టర్‌ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు నెలలో ఒక రోజు విద్యార్థులతో కలిసి నిద్రించాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలి

- జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో వివిధ శాఖల ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యదర్శి లక్ష్మీనారాయణతో కలిసి మిషన్‌ భగరథ, వ్యవసాయ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య, విద్యుత్‌, హౌసింగ్‌ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌లో నమోదు చేసే అంశంపై అందించిన శిక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ పంచాయతీల్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీల్లో తెల్లరేషన్‌ కార్డులు కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య, గ్రామ పంచాయతీ పరిధిలో కబ్జా నివాస గృహాల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్‌ తెగల ప్రజలపై జరిగిన ఘటనల వివరాలు ఉంటే ప్రస్తుత స్థితిగతులు పొందుపరుచాలని చెప్పారు. గ్రామ పంచాయతీలలో ఆరోగ్య భీమా కలిగిన కుటుంబాల సంఖ్య అందుబాటులో ఉన్న నర్సరీలు, సామాజిక పెన్షన్‌లు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ పెన్షన్ల సంఖ్య, మిషన్‌ భగరథ ద్వారా తాగునీరు అందుతున్న కుటుంబాల వివరాలు, విద్యుత్‌ సౌకర్యం కలిగిన ఇళ్ల సంఖ్య ఇతర పూర్తి వివరాలను ట్రైనింగ్‌ మెనేజ్‌మెంట్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. ప్రతి సమాచారాన్ని క్లుప్తంగా నమోదు చేయాలని, పూర్తి వాస్తవిక సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో ఉమర్‌హుస్సేన్‌, ఎంపీడీఓలు, కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:26 PM