Telangana Education: నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేకంగా కొత్త పాఠశాలలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:16 AM
రాష్ట్రంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు బోధించేలా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే...
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు బోధించేలా ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వాటిలో కార్పొరేట్ బడుల స్థాయిలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని.. విద్యార్థులకు పాలు, అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం (లంచ్) అందించేలా ప్రణాళికలు సిద్థం చేయాలని సూచించారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో.. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి, ప్రభుత్వ సలహదారు కే.కేశవరావు, సీఎం సలహదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీపైమరీ) తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏమాత్రం సౌకర్యాలు లేని ప్రాథమిక పాఠశాలలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి, సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తొలిదశలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి సారించాలన్నారు. ఈ రీజియన్‌లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు. అవసరం మేరకు తరగతి గదులతోపాటు ఆటస్థలం, మంచి వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. ఈ మేరకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. ఇక ఉన్నత విద్యలో అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వంపైనా భారం పడుతోందని, ఆ భారం తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్ష సందర్భంగా ఉన్నత విద్యా రంగంలో గత ఏడాది సాధించిన విజయాలు, వచ్చే ఏడాదిలో అమలుచేయనున్న సంస్కరణలపై రూపొందించిన నివేదికను ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు బాలకిష్టారెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.