Share News

Telangana Assembly Speaker Prasad Kumar: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు విచారణ పునఃప్రారంభం

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:59 AM

బీఆర్‌ఎస్‌ టికెట్‌పైన గెలిచి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపైన విచారణను స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌...

Telangana Assembly Speaker Prasad Kumar: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు విచారణ పునఃప్రారంభం

  • ప్రకాశ్‌గౌడ్‌, యాదయ్య, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలమీద పిటిషన్లపై విచారణ

  • నేడు హైదరాబాద్‌కు రానున్న స్పీకర్‌

  • మిగిలిన నలుగురు ఎమ్మెల్యేల విచారణ

  • 31 వరకూ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు

  • శాసనసభ, మండలిలను ప్రొరోగ్‌ చేసిన గవర్నర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ టికెట్‌పైన గెలిచి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపైన విచారణను స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ పునఃప్రారంభించనున్నారు. కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ సదస్సులో పాల్గొనేందుకు బార్బడోస్‌ వెళ్లిన ప్రసాద్‌కుమార్‌.. గురువారం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆయన బార్బడోస్‌ టూర్‌కు వెళ్లే ముందు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలపై దాఖలైన పిటిషన్లపైన విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన టూర్‌ నేపథ్యంలో విచారణకు విరామం ఇచ్చారు. శుక్రవారం ఆ నలుగురు ఎమ్మెల్యేలమీద దాఖలైన పిటిషన్లపై వాదనలు స్పీకర్‌ సమక్షంలో జరగనున్నట్లు బుధవారం ఆయన కార్యాలయం వెల్లడించింది. కాగా.. అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్‌ నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలు మినహా మిగిలిన 8 మంది వివరణ ఇచ్చారు. ఆ 8 మందిలో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషన్లపైన విచారణను ప్రారంభించిన స్పీకర్‌.. శుక్రవారం ముగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, తెల్లం వెంకట్రావు, ఎం. సంజయ్‌కుమార్‌లపై దాఖలైన పిటిషన్ల విచారణను ఈ నెల 27 నుంచి చేపట్టే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి ఈ నెల 31 వరకు అసెంబ్లీ ప్రాంగణంలోకి విజిటర్లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు.


శాసనసభ, మండలి ప్రొరోగ్‌

శాసనసభ, మండలి సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గడిచిన ఆగస్టు 30న ప్రారంభమైన శాసనసభ, మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేటీఆర్‌కు లేదు: అద్దంకి

‘‘కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా దానం నాగేందర్‌ను పెట్టినందుకు కేటీఆర్‌ ఎగిరెగిరి పడుతున్నడు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితాఇంద్రారెడ్డిలను కేసీఆర్‌ మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ప్రశ్నించారు. సీఎల్పీ మీడియా హాల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేటీఆర్‌కు లేదన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 05:59 AM