Speaker Gaddam Prasad Kumar: వాళ్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే..
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:36 AM
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ కొట్టివేశారు....
పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవ్
పత్రికల్లో వచ్చిన వార్తలు, ధ్రువీకరించని
టీవీ చానళ్ల వీడియోలను సమర్పించారు
చట్టప్రకారం నిలబడే సాక్ష్యాధారాలు ఇవ్వలేదు
ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పిటిషనర్లు ఆరోపించారు
ఆ విషయాన్నీ నిరూపించలేకపోయారు
శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ స్పష్టీకరణ
అనర్హత పిటిషన్ల కొట్టివేత
మహిపాల్‌రెడ్డి, గాంధీ, ప్రకాశ్‌గౌడ్, వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఊరట
నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై తీర్పు
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ కొట్టివేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్‌లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఐదుగురూ పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలను పిటిషనర్లు సమర్పించలేకపోయారని తెలిపారు. వీరు బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేసుకున్నట్లేనని పేర్కొన్న పిటిషనర్లు.. ఆ విషయాన్ని నిరూపించలేకపోయారనిస్పీకర్ చెప్పారు.
పత్రికల్లోని వార్తలు, ధ్రువీకరించని టీవీ చానళ్ల వీడియోలు సమర్పించారు తప్ప చట్ట ప్రకారం నిలబడే ఆధారాలు చూపలేకపోయారని వెల్లడించారు. పిటిషన్‌లోని అంశాలు, వాటిపై ఐదుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలను పరిశీలించి, విశ్లేషించి, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇస్తున్నట్లు సభాపతి స్పష్టం చేశారు. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ, వారంతా ఎమ్మెల్యేలుగా కొనసాగుతారంటూ స్పీకర్ ప్రసాద్‌కుమార్ బుధవారం కీలక తీర్పు వెలువరించారు. గత శాసనసభ ఎన్నికల్లో అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరువు), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల) బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అనంతరం వీరు పార్టీ ఫిరాయించి, కాంగ్రె్‌సలో చేరారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభాపతికి ఫిర్యాదు చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. తమ ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై డిసెంబరు 19లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ ఫిర్యాదులపై వాదనలు విన్న సభాపతి.. తాజాగా తీర్పును వెలువరించారు.
నాలుగు అంశాల ఆధారంగా ఫిర్యాదు..
ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్‌ఎస్ పార్టీ నాలుగు అంశాల ఆధారంగా సభాపతికి ఫిర్యాదు చేసింది. వాటిపై ఆ ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇచ్చారు. అన్నింటినీ సభాపతి పరిశీలించారు.
1. ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇది రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వివరాలున్న పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(ఎ) కింద బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పిటిషనర్లు ఫిర్యాదు చేశారు.
ఈ ఆరోపణను ఐదుగురు ఎమ్మెల్యేలూ తిరస్కరించారు. సీఎం రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిశామని, నియోజకవర్గ అభివృద్ధి అంశాలను అడిగేందుకే వెళ్లామని తెలిపారు. అప్పుడు ఆయన మర్యాదపూర్వకంగా మూడు రంగుల కండువాను కప్పారని వివరణ ఇచ్చారు. ఈ చర్య 10వ షెడ్యూల్‌లోని నిబంధనల్లో పేర్కొన్నట్లు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం వదులుకోవడం కిందకు రాదని వివరించారు.
2. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయకున్నా, వారి చర్యల ఆధారంగా చేసినట్లే కనిపిస్తోందని, పదో షెడ్యూల్‌లోని అంశాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.
తాము బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసినట్లుగా ఎలాంటి న్యాయపరమైన ఆధారం లేదని ఐదుగురు ఎమ్మెల్యేలూ తెలిపారు. అసెంబ్లీ రికార్డుల్లో తాము బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నామన్నారు. సభాపతికి కూడా దీనిపై తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గుర్తుచేశారు.
3. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో కూడా పాల్గొన్నారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు.
4 ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సతో సఖ్యతగా ఉండడం లేదని, వారి ప్రవర్తన కాంగ్రె్‌సకు అనుకూలంగా ఉంటోందని ఫిర్యాదు చేశారు.
సాంకేతిక ఆధారాల్లేకుండా ప్రవర్తన ఆధారంగానే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింపజేయడం కుదరదని ఎమ్మెల్యేలు వాదించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సభాపతి.. చెల్లుబాటయ్యే సాక్ష్యాలు, ఆధారాలు లేవన్న నిర్ణయానికి వచ్చారు. అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.
నేడు మరో ముగ్గురి విషయంలో తీర్పు..
మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్యల అనర్హత పిటిషన్‌లపై గురువారం సభాపతి తన తీర్పును వెలువరించనున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మాత్రం తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని సభాపతికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దీంతో వారి వాదనలు విన్నాకే అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.