Share News

SP Balasubrahmanyam Immortalized with Bronze Statue: బాలు పాట అజరామరం

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:23 AM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రతి పాటా, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడేవి. బాలు పాట ఎంత గొప్పదో...

SP Balasubrahmanyam Immortalized with Bronze Statue: బాలు పాట అజరామరం

  • స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం

  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

  • సంగీతానికి ప్రాంతీయ భేదం లేదు: దుద్దిళ్ల

  • నాన్న రాజకీయాలకు అతీతం: ఎస్పీ చరణ్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రతి పాటా, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యమాడేవి. బాలు పాట ఎంత గొప్పదో, ఆయన వ్యక్తిత్వం అంతకన్నా మధురమైంది’’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు. ‘‘బాలు జీవితం సినీసంగీత చరిత్రలో ఓ మైలురాయి’’ అని అభివర్ణించారు. ఘంటసాల, బాలు ద్వయం తెలుగు పాటకు పట్టాభిషేకం చేశారని కీర్తించారు. తెలుగు పాటను ప్రేక్షకుల హృదయ సింహాసనంపై కూర్చోబెట్టడమేకాక.. తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తెచ్చిన ఘనత ఆ గురుశిష్యుల సొంతమని కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ది మ్యూజిక్‌ గ్రూప్‌ సంయుక్త నిర్వహణలో సోమవారం రవీంద్ర భారతి ప్రాంగణంలో వెంకయ్యనాయుడు చేతులమీదగా పద్మవిభూషణ్‌, గానగంధర్వ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ విగ్రహాన్ని చూస్తుంటే నిండైన తెలుగుతనం మూర్తీభవించిన బాలు రూపం కళ్లముందు సాక్షాత్కరించినట్టుంది’ అని ఆనందం వ్యక్తంచేశారు. బాలు పాట అజరామరమని కొనియాడారు. స్వర సారభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనమైన బాలుతో తనది ఆత్మీయానుబంధమని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. బాలు తండ్రి సాంబమూర్తి నెల్లూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించేవారని చెబుతూ.. ‘అప్పుడు నేను నెల్లూరివాడిని. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను కనుక తెలంగాణ వాడిని. బహుశా! కన్నుమూసేది కూడా ఇక్కడేనేమో’ అంటూ వెంకయ్యనాయుడు ఉద్వేగభరితంగా మాట్లాడారు. అన్నమయ్యకీర్తనలు, ఘంటసాల, బాలు పాటలు వినడంతోనే తన దినచర్య మొదలవుతుందన్నారు. బాలు విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చొరవ అభినందనీయమన్నారు.


అందరివాడు బాలు..

ఒకటి, రెండు కాదు.. 14 భాషల్లో 40వేలకుపైగా పాటలు పాడి, సంగీత ప్రపంచంలోనే రారాజుగా నిలిచిన అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ ఒక్క కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని.. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ప్రపంచ స్థాయి ప్రతిభామూర్తిని సమున్నతంగా గౌరవించుకోవడంలో భాగంగా కళలను ప్రోత్సహించే రవీంద్రభారతి ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం బాలు విగ్రహావిష్కరణను నిర్వహిస్తోందని చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమైన సమావేశాల వల్ల సీఎం రేవంత్‌ రెడ్డి, స్థానిక ఎన్నికల వల్ల మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సభకు హాజరుకాలేకపోయాని శ్రీధర్‌ బాబు తెలిపారు. సంగీతానికి జాతీయత, భాష, ప్రాంతం వంటి భేదాలు లేవని నొక్కిచెప్పారు. హైదరాబాద్‌ వేదికగా ఎన్నోవందల పాటలు పాడి, ఈ ప్రాంత కీర్తిని ప్రపంచానికి చాటడంలో ప్రముఖ పాత్ర వహించిన బాలు సేవలను.. ఈ విగ్రహం భావితరాలకు గుర్తుచేస్తుందన్నారు. ఇక.. బాలు విగ్రహావిష్కరణ తెలుగు ప్రజలందరికీ గొప్ప గౌరవమని మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. బాలు విగ్రహావిష్కరణకు పూర్తిసహాయ సహకారాలు అందించిన తెలంగాణ సాంస్కృతిక శాఖ కృషి ప్రత్యేకమైంది అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచంద్రరావు అభినందించారు. ‘‘బాలు పాట మధురం.. మాట ఆత్మీయం.. మనసు లాలిత్యం... సంస్కారం ఆచరణీయం’’ అని శాంతాబయోటెక్‌ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌ రెడ్డి భావయుక్తంగా వివరించారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే మెలిగారు. వీళ్లు ఆత్మీయులు - వాళ్లు మిత్రులు అనికాకుండా అందరినీ తనవాళ్లుగా భావించారు’’ అంటూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి, శుభలేఖ సుధాకర్‌, ఎస్పీ శైలజ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బాలు విగ్రహావిష్కరణకు కృషిచేసిన లోక్‌సభ సభ్యుడు మల్లు రవి సోదరుడు మల్లు ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.


ఎలాంటి ఆటంకం కలగకుండా..

రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ పోలీసుల గట్టి బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. విగ్రహ ఏర్పాటును కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం తలెత్తకుండా సభా ప్రాంగణంలో సోమవారం ఉదయం నుంచే అడుగడుగునా పోలీసులు మోహరించారు. పాసులు, గుర్తింపు కార్డులున్న వ్యక్తులను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించారు. కాగా.. బాలు విగ్రహావిష్కరణను వ్యతిరేకిస్తూ లోయర్‌ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర తెలంగాణ జేఏసీ ప్రతినిధులు నిరసన తెలిపారు.

నాలుగేళ్ల ప్రయత్నమిది..

ఎస్పీ బాలు విగ్రహం నెలకొల్పాలన్న సంకల్పంతో ది మ్యూజిక్‌ గ్రూపు సభ్యులు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది ఇప్పుడు ఫలించింది. బాలు విగ్రహం నెలకొల్పడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తాము పలు మార్లు కోరినా, పెద్దలు స్పందించలేదని నిర్వాహకుల్లో ఒకరు చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి శ్రీధర్‌ బాబు మద్దతుగా నిలవడంతో పాటు.. మల్లు రవి సోదరుడు మల్లు ప్రసాద్‌ చొరవ తోడవడంతో బృందమంతా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలసి తమ అభిమతాన్ని వెల్లడించారు. అందుకు ఆయన.. బాలు విగ్రహావిష్కరణ బాధ్యతను తమ శాఖ నుంచి నిర్వహిస్తానని మాటిచ్చారు. అలా బాలు అభిమానులు తలపెట్టిన విగ్రహ ప్రతిష్ఠను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని నిర్వాహకులు వివరించారు. అందుకు సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్‌ బాబు, జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.


బాలు మెచ్చిన విగ్రహమే

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో ‘ఏమి ఈ వింత మోహం’ అంటూ తొలి పాట పాడిన ఇదే రోజున (1966, డిసెంబరు 15) ఆయన విగ్రహావిష్కరణ జరగడం విశేషమని కార్యక్రమ వ్యాఖ్యాతలు సుమ, సీనియర్‌ ప్రదీప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు ఆ పాట పాడడానికి బాలును సైకిల్‌మీద రికార్డింగ్‌ స్టూడియోకు తీసుకెళ్లిన ఆయన మిత్రుడు జీవీ మురళీని వక్తలు శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. బాలు విగ్రహాన్ని తీర్చిదిద్దిన ప్రముఖ శిల్పి వడయార్‌ను కూడా సత్కరించారు. ఒక టన్ను కాంస్యంతో ఏడున్నర అడుగుల ఎత్తులో.. 60ఏళ్ల వయసులో మన గానగంధర్వుడు ఎలా ఉండేవారో ఆ రూపంలో విగ్రహాన్ని తయారుచేసినట్లు వడయార్‌ తెలిపారు. విగ్రహ తయారీకి సుమారు మూడునెలలు పట్టిందని చెప్పారు. గుంటూరులో ప్రతిష్ఠించిన బాలు విగ్రహన్ని కూడా తానే రూపొందించినట్లు తెలిపారు. ‘‘బాలుగారి తల్లిదండ్రులు సాంబమూర్తి, శకుంతలమ్మ విగ్రహాలు తయారు చేయించడం కోసంగా రాజమండ్రిలోని మా శిల్పశాలకు ఆ మహనీయుడు 2018-19 మధ్యకాలంలో మూడుసార్లు వచ్చారు. అప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం గారి నిలువెత్తు విగ్రహం డిజైన్‌ను రూపకల్పనచేసి ఆయనకు చూపించాను. చాలా సంతోషించారు. అలా రవీంద్రభారతిలో ఇప్పుడు ప్రతిష్ఠించిన తన విగ్రహాన్ని బాలుగారు ముందే కళ్లారా చూసుకోవడం ఈ ప్రతిమ ప్రత్యేకత’’ అని శిల్పి వడయార్‌ చెప్పారు.

Updated Date - Dec 16 , 2025 | 04:23 AM