kumaram bheem asifabad- కట్టలపై విత్తి.. సాగుకు సం‘పత్తి’
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:29 PM
భూమిని కట్టలుగా మార్చి పత్తి పంటను సాగు చేయడం ద్వారా మంచి పంట దిగుబడి సాధిం చవచ్చని అధికారుల సూచన మేరకు రైతులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచి ఉండడంతో పంటల పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కానీ ఏజెన్సీ మండలాల్లోని పలువురు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో సాగుకు ముందు నుంచే వినూత్నంగా ఆలోచించి పత్తి పంట పండిస్తున్నారు.
- నీరు నిలిచి పంట దెబ్బతినకుండా చర్యలు
జైనూర్/సిర్పూర్(యు)/లింగాపూర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): భూమిని కట్టలుగా మార్చి పత్తి పంటను సాగు చేయడం ద్వారా మంచి పంట దిగుబడి సాధిం చవచ్చని అధికారుల సూచన మేరకు రైతులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచి ఉండడంతో పంటల పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కానీ ఏజెన్సీ మండలాల్లోని పలువురు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో సాగుకు ముందు నుంచే వినూత్నంగా ఆలోచించి పత్తి పంట పండిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలకు నీరు నిలువ ఉన్నా తమ పంటలకు ఇబ్బంది ఉండడం లేదని, బాగా ఎదుగుతున్నాయని చెబుతున్నారు.
- జాగ్రత్తలు ఇలా..
విత్తేసమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నల్లరేగడి నెలల్లో పత్తి విత్తడానికి ముందు 2 నుంచి 4 అడుగుల దూరంలో మట్టితో కట్టలుగా నేలను తయారు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసిన కట్టలకు మధ్యలో నీరు నిల్వ ఉండకుండా ఒక కాలువలా ఉండేలా చూసుకోవాలి. అనంతరం విత్తనాలు పెట్టే క్రమంలో కట్టపైన మాత్రమే విత్తాలి. ఈ విధంగా విత్తడంతో మొక్క ఎత్తుగా ఉండడంతో నీరు నిల్వ ఉండకుండా ముందుకు పారుతుంది. ఒక వేళ నీరు నిల్వ ఉన్నా విత్తనం కట్టపై ఉండడంతో ఇబ్బంది ఉండదు. సాధారణంగా చాలా మంది రైతులు ఇలా చేయరు. నేలపైనే విత్తుకుంటారు. దీని వల్ల నీరు నిల్వ ఉంటే ప్రదేశాల్లో పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది.
- 4.10 లక్షల ఎకరాల్లో పంటలు
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 4.10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి పంట 3.35 లక్షల ఎకరాల్లో సాగవుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పంటకు ప్రధానంగా నల్ల రేగడి భూములు అనుకూలం. కానీ వరుసగా కురుస్తున్న అధిక వర్షాలతో ఈ భూముల్లో నీరు నిలువ ఉండే ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక నీరు నిలువ కారణంగా పెరుగుదల ఆగి పోతుంది. కాత, పూత దశలో ఉన్న ఈ సమయంలో నిలువ ఉండడం మంచిది కాదు. రోజుల తరబడి ఉంటే మొక్కలు పెరిగి పోయే ప్రమాదం కూడా ఉంది. క్రమంగా రైతన్నలకు ఆశించిన దిగుబడి రాక పోవచ్చు. దిన్ని గుర్తించిన అధికారులు సాగుకు ముందు నుంచే పలువురి వ్యవసాయం క్షేత్రాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో కట్టలు కట్టుకుని వాటిపై విత్తనాలు విత్తి పత్తి సాగు చేస్తున్న ఈ రైతు కుడిమెత రమేశ్. జైనూరు మండలంలోని పోచంలొద్దికి చెందిన వాడు. వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం ఇలా సాగు చేస్తున్నాడు. అధిక వర్షాలకు చేనులో నీరు నిలువ ఉన్నా..పంటలకు ఇబ్బంది ఉండదని చెబు తున్నారు. ఈ ఏడాది అధిక దిగుబడి వస్తుందని చెబుతున్నాడు.