Rainfall: మొదలైన నైరుతి నిష్క్రమణ
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:46 AM
ఈ ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి..
దేశంలో 7 శాతం అధికంగా వర్షాలు.. 20న అల్పపీడనం..?
విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. సాధారణంగా సెప్టెంబరు 17న ఆ ప్రాంతం నుంచి రుతుపవనాలు నిష్క్రమించాల్సి ఉంది. దానికి మూడు రోజులు ముందుగానే ఈసారి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో భాగంగా జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 14వ వరకు సాధారణంగా 790.1 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, 846.4 మి.మీ.(7 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కొన్ని మోడళ్ల మేరకు ఇది 20నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అది బలపడుతుందా..?లేదా..? ఇప్పుడే చెప్పలేమన్నారు.