Indian cuisine: దక్షిణాది వంటకంబు.. ఒహొహ్హొ మాకె విందు..
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:36 AM
కాలిఫోర్నియాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఒక తెలుగు టెకీ.. తన సహోద్యోగులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అందరినీ మధ్యాహ్న భోజనానికి.. దగ్గర్లోని భారతీయ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక.. వారు ఆర్డర్ చేసిన మెనూ చూసి నివ్వెరపోవడం అతని వంతయింది. ఎందుకంటే......
మన వంటకాలను ఇష్టంగా తింటున్న అమెరికన్లు
యూఎ్‌సలో దాదాపు పది వేల భారతీయ రెస్టారెంట్లు
వాటిలో ఏకంగా 2000 రెస్టారెంట్లు.. కాలిఫోర్నియాలోనే!
ఇండియన్‌రెస్టారెంట్ల కేంద్రంగా డాలస్ మెట్రో ఏరియా
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కన్నా కొందర్ షెఫ్‌ల జీతమే ఎక్కువ
(డాలస్ నుంచి కృష్ణమోహన్ దాసరి)
కాలిఫోర్నియాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఒక తెలుగు టెకీ.. తన సహోద్యోగులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అందరినీ మధ్యాహ్న భోజనానికి.. దగ్గర్లోని భారతీయ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక.. వారు ఆర్డర్ చేసిన మెనూ చూసి నివ్వెరపోవడం అతని వంతయింది. ఎందుకంటే.. వారందరూ ఆర్డర్ చేసింది బిర్యానీలు, మసాలా కర్రీలు, మన దక్షిణాది వం టకాలు!! అమెరికన్లు సాధారణంగా మసాలాలు తక్కువ ఉండే వంటకాలను ఇష్టపడతారు. విదేశీ వంటకాల్లో.. థా య్ ఆహారానికి అమెరికన్లలో ఆదరణ ఎక్కువ. వియ త్నాం, జపాన్ తదితర దేశాలు ఆ తర్వాత స్థానాలను ఆక్రమిస్తుంటాయి. మొన్నటిదాకా భారతీయరెస్టారెంట్లకొచ్చినా.. చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్, నాన్లు వంటివే ఎక్కువగా తినేవారు. రానురానూ ట్రెండ్ మార్చి.. ఇప్పుడు స్పైసీగా ఉండే దక్షిణాది ఆహారాన్నీ ఇష్టంగా తింటున్నారు. ఎప్పుడూ వారు వెళ్లే టాకోబెల్, సబ్‌వే, మెక్ డొనాల్డ్స్ వంటివాటితో పోల్చితే ఇండియన్ రెస్టారెంట్లలో ధరలు ఎక్కువైనా. వాటికే వెళ్తున్నారు.
పెరుగుతున్న మన రెస్టారెంట్ల సంఖ్య..
అమెరికాలో చైనీస్, ఫిలిప్పీన్స్‌వాసుల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆసియన్లు భారతీయులే. కానీ, జనాభా పరంగా చూస్తే భారతీయ రెస్టారెంట్ల సంఖ్య ఇప్పటి వరకూ చాలా తక్కువే. ఇప్పుడు అమెరికన్లు కూడా మన వంటకాలను ఇష్టంగా అడిగి తింటుండడంతో.. తెలుగు ప్రవాసులు యూఎస్ నగరాల్లో రెస్టారెంట్లను విరివిగా ప్రారంభిస్తున్నారు. 2025 అక్టోబర్ గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపుగా పదివేల (9438) భారతీయ రెస్టారెంట్లు ఉంటే, వాటిలో 2000 రెస్టారెంట్లు ఒక్క కాలిఫోర్నియాలోనే ఉన్నాయి! దాదాపు 1500 రెస్టారెంట్లతో టెక్సాస్.. 1000 రెస్టారెంట్లతో న్యూయార్క్ రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలోని ప్రధాన మెట్రో నగరాలైన న్యూయా ర్క్, లాస్‌ఏంజెలెస్, షికాగో, డాలస్, హ్యూస్టన్‌లలో భారతీయ రెస్టారెంట్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. డాలస్ మెట్రో ఏరియా.. భారతీయ రుచులకు.. ప్రధానంగా దక్షిణ భారత రుచులందిం చే రెస్టారెంట్లకు హబ్‌గా మారింది. ఈ ప్రాంతంలో దాదాపు 400 ఇండియన్ రెస్టారెంట్లున్నాయి. అదనం గా నేపాలీ, పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెస్టారెంట్లు ఉన్నా.. వాటికి ఇండియన్ రెస్టారెంట్ల పేర్లే ఉంటాయి.
‘లెక్క’ చేయట్లేదు!
అమెరికాలోని మనోళ్లు.. గతంలో వారాంతాల్లో అయినా సరే.. బయట తినాలంటే మీనమేషాలు లెక్కించేవారు. రెస్టారెంట్లలో ఆహారపదార్థాల ధరలను భారత్‌లోని ధరలతో పోల్చి చూసుకుని.. జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచుకునేవారు. దాదాపు ఓ దశాబ్దం క్రితం వరకూ పరిస్థితి ఇలాగే ఉండేది. ఆ తర్వాత నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. ఇప్పుడు.. బయట తినాలని అనిపించిందే తడవుగా కుటుంబసభ్యుల్ని, మిత్రుల్ని వెంటబెట్టుకుని రెస్టారెంట్లకు వెళ్తున్నారు. ఎన్నారైలలో యువతరం దామాషా పెరుగుతున్న కొద్దీ ఈ తేడా స్పష్టంగా తెలుస్తోంది. వారు ధరలను అస్సలు పట్టించుకోవట్లేదు. డాల్‌సలో 12 డాలర్లుండే చికెన్ బిర్యానీ, కాలిఫోర్నియాలో పాతిక డాలర్లు. సియాటెల్‌లో ఇంకా ఎక్కువ. యూఎ్‌సలో ప్రతి ఊరిలోనూ బావార్చీ బిర్యానీ, బిర్యానీ బెస్ట్రో, బిర్యానీ పాట్, హైదరాబాద్ హౌస్, ప్యారడైజ్, స్వదేశీ తదితర పేర్లతో రెస్టారెంట్లు పుష్కలంగా కనిపిస్తాయి. వీటితోపాటు ఇండియాలో ఎంతో ప్రసిద్ధి పొందిన శరవణ భవన్, అడయార్ ఆనంద భవన్, బార్బిక్యూ నేషన్, పిస్తా హౌస్ మొదలైన గ్రూపులు అమెరికాలో కూడా ఫ్రాంచైజీ మోడల్‌లో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాయి.
దశాబ్దాల క్రితమే..
అమెరికాలో భారతీయ రెస్టారెంట్ల విప్లవం శ్రీకారం దిద్దుకోవడానికి కాలిఫోర్నియా బర్కిలీకి చెందిన లక్కిరెడ్డి బాల్ రెడ్డి ఆద్యుడని చెప్పాలి. దాదాపు 40-50 ఏళ్లక్రితమే ఆయన భారతీయ రెస్టారెంట్లను స్థాపించారు. కృష్ణాజిల్లా మైలవరం దగ్గర వెల్వడం గ్రామ వాసి లక్కిరెడ్డి, 1970ల్లో ప్రారంభించిన పసంద్ అనే ఇండియన్ రెస్టారెంటు 3 దశాబ్దాలు దక్షి ణ భారత వంటకాలతో అలరించింది. అదే గ్రామవాసి, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ప్రారంభించిన స్వాగత్ గ్రూపు రెస్టారెంట్లు 35 ఏళ్లుగా కాలిఫోర్నియాలోని సిలికాన్ వాలీ భోజన ప్రియులను తృప్తి పరుస్తున్నా యి. అమెరికాలోని రెస్టారెంట్ షెఫ్‌లు, ఓనర్ల లో మైలవరం ప్రాంతం వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఖమ్మం జిల్లా మధిర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు షెఫ్‌లుగా పనిచేస్తున్నారు. ఎన్నారై శివ యార్లగడ్డ.. అమెరికా, కెనడా, యూర్‌పలలో నవాబీ హైదరాబాద్ హౌస్ పేరుతో దాదాపు 50 రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. 2024లో న్యూయార్క్ టైమ్స్ ఎంపిక చేసిన ‘అమెరికాలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల’ జాబితాలో.. ఆయన సింప్లీ సౌత్ వెజిటేరియన్ రెస్టారెంట్ కూడా ఉంది. మాం క్స్ పేరుతో ఇండో చైనిస్ రెస్టారెంటు కూడా నిర్వహిస్తున్నారు. మరో ఎన్నారై కిషోర్ కంచర్ల ఆధ్వర్యంలో అమెరికాలో దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో బావార్చి బిర్యానీ రెస్టారెంట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. తొలుత వీరం తా అమెరికాలోని భారతీయుల కోసమే ప్రారంభించినా ఇండియన్ క్విజిన్‌లో ఉండే ఇంద్రజాలం.. అమెరికన్లనూ సమ్మోహితుల్ని చేయడం ఇటీవలే మొదలైంది. తెలుగు కన్సల్టెన్సీల వారు, గ్రాసరీ స్టోర్స్ యజమానులు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్న నవతరం కూడా కాస్త నిలదొక్కుకోగానే.. నలుగురు కలిసి ఒక రెస్టారెంటు ప్రారంభిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్‌ను తలదన్నే వేతనాలు!
ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే.. కొన్ని భారతీయ రెస్టారెంట్లలో షెఫ్‌లే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు.. పదేళ్ల క్రితంఇక్కడ రెస్టారెంట్లలో క్లీనర్లుగా పనిచేయడానికి ఇండియా నుంచి వచ్చిన ఒక జంట.. చిన్న జీతాలకు కుదురుకుని క్రమంగా వంటలు వండడమూ ప్రారంభించారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఇద్దరికీ కలిపి నెలకు 12 వేల డాలర్ల వేతనం, ఉచిత నివాసం, ఇతర ఖర్చులు ఇచ్చి వంటలు వండించుకుంటున్నారు. అందరికీ అంత కాకున్నా.. సగటున షెఫ్‌ల జీతాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యేకించి తెలుగురాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినవారు షెఫ్‌లుగా పనిచేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కానీ, ఈ క్రమంలో కొన్ని విపరిణామాలు కూడా సంభవిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది లక్షలాది రూపాయలు దళారులకు కట్టి అమెరికాకు వచ్చి షెఫ్‌లుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మోసపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. అదే సమయంలో.. అమెరికాకు చదువుకోవడానికి వచ్చిన తెలుగు విద్యార్థుల్లో కొందరు మనవాళ్లు పెట్టే రెస్టారెంట్లలో పనిచేస్తూ తమ తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధారపడకుండా గడుపుతున్నారు.
షెఫ్‌ల జీతాలు పెంచేస్తూ నష్టాల్లోకి..
అమెరికాలో మనోళ్ల రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతున్నా.. సక్సెస్ రేటు అనుకున్నంత లేదు. షెఫ్‌ల జీతాలు భరించలేని స్థాయిలో పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. రెస్టారెంట్ల యజమానులు తమలో తాము పోటీ పడుతూ.. బాగా నడుస్తున్న రెస్టారెంట్‌లోని షెఫ్‌లకు భారీగా జీతాలు ఆఫర్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సాధారణ షెఫ్‌కు ఇల్లు, ఆహారం అన్నీ సమకూర్చి, జీతంగా చెల్లిస్తున్న కనీస మొత్తం 5 వేల డాలర్లు కాగా, కొంచెం సీనియర్ కర్రీ షెఫ్‌లకు ఆరు వేల నుంచి 10 వేల డాలర్ల దాకా ఇస్తున్నారు. చాలా రెస్టారెంట్ల యజమానుల కంటె షెఫ్‌ల పని బాగుందని చెప్పొచ్చు. ఇలా అమెరికాలో టాప్ గేర్‌లో వర్ధిల్లుతున్న ఇండియన్ రెస్టారెంట్ల వ్యాపారం గాలిబుడగలాగా పేలిపోకూడదంటే.. యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పోటీలు పడి షెఫ్‌లకు స్థాయికి మించి వేతనాలు చెల్లించి, అంతిమంగా రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.