South Central Railway: దక్షిణ మధ్య రైల్వేకు 19,314 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:10 AM
దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రికార్డు స్థాయిలో రూ.19,314 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది.
జనవరి నుంచి నవంబరు వరకు నమోదు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రికార్డు స్థాయిలో రూ.19,314 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. గత ఏడాది ఇదేకాలంలో వచ్చిన ఆదాయం (రూ.18,831 కోట్లు)కన్నా ఇది రూ.483 కోట్లు ఎక్కువ. ఈసారి ప్రధానంగా 136.2 మిలియన్ టన్నుల సరకు రవాణాతో రూ.12,841 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రయాణికుల నుంచి చార్జీల ద్వారా రూ.5,525 కోట్ల ఆదాయం వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌లలో రైళ్ల రద్దీ తగ్గించేందుకు ఈఏడాది చర్లపల్లిలో నూతన శాటిలైట్ టెర్మినల్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే ేస్టషన్లను అమృత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసినట్టు తెలిపారు. రూ.2.2 కోట్ల వ్యయంతో కాచిగూడ హెరిటేజ్ స్టేషన్‌ను ఇండో-గోథిక్ శైలిలో పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు. సంజామల, యేర్పేడు, జనపహాడ్‌ల వద్ద కార్గో గతి శక్తి టెర్మినల్స్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. 68 ప్రాంతాల్లో మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించి 22 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 60 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించినట్టు వివరించారు. ఈ ఏడాది కొత్తగా 199 కిలోమీటర్ల ట్రాక్‌ను అభివృద్ధి చేయగా.. ఇందులో 144 కిలోమీటర్లు మూడో లైన్, 40 కిలోమీటర్ల డబుల్ లైన్ ఉన్నాయి. వంద శాతం విద్యుదీకరణ పూర్తవడంతో సికింద్రాబాద్ డివిజన్ ప్రత్యేక ఘనతను పొందింది.
సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు...
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 7 నుంచి 12 వరకు హైదరాబాద్ నుంచి/మీదుగా మొత్తం 11 ప్రత్యేక రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 7, 8, 9 తేదీల్లోకాకినాడ నుంచి వికారాబాద్‌కు మూడు, 8న సికింద్రాబాద్-పార్వతీపురం మార్గంలో ఒకటి, 9న పార్వతీపురం నుంచి సికింంద్రాబాద్‌కు ఒకటి, 9, 10 తేదీల్లో వికారాబాద్ నుంచి పార్వతీపురంకు రెండు, 10న పార్వతీపురం నుంచి వికారాబాద్‌కు ఒకటి, 12న పార్వతీపురం-కాకినాడ మధ్య ఒకటి, 8, 10 తేదీల్లో వికారాబాద్-కాకినాడ మార్గంలో 2 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ బుకింగ్ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు.