Share News

Family Dispute: ఇలాంటి కొడుకులొద్దు తండ్రీ

ABN , Publish Date - Oct 16 , 2025 | 01:45 AM

ద్దరు చెట్టంత కొడుకులున్నా.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్దయగా దూరం పెట్టారు. తండ్రి అనారోగ్యంతో చనిపోతే..

Family Dispute: ఇలాంటి కొడుకులొద్దు తండ్రీ

  • తాము ఉంటోంది అద్దె ఇళ్లు అని చెప్పితండ్రి మృతదేహాన్ని పెట్టనీయని కుమారులు

  • రైతు వేదిక వద్ద మృతదేహం.. రాత్రంతా తల్లి శవజాగారం.. సిద్దిపేట జిల్లాలో ఘటన

సిద్దిపేట రూరల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు చెట్టంత కొడుకులున్నా.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్దయగా దూరం పెట్టారు. తండ్రి అనారోగ్యంతో చనిపోతే.. ముందుండి అంత్యక్రియలు నిర్వహించాల్సింది పోయి, తాము ఉంటున్నది అద్దె ఇళ్లలో అని చెబుతూ మృతదేహాన్ని తీసివేయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మృతదేహాన్ని కొద్దిసేపు బస్టాండ్‌లో, ఆ తర్వాత రైతు వేదిక వద్ద ఉంచితే అక్కడే రాత్రంతా శవజాగారం చేసిన ఆ వృద్ధురాలు చివరికి తానొక్కత్తే భర్త అంత్యక్రియలు నిర్వహించింది. మానవతావాదులను కన్నీరు పెట్టించేలా ఉన్న ఈ ఘటన సిద్దిపేట జిల్లా రూరల్‌ మండలం పుల్లూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గొడుకు పోచయ్య(67), యాదవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్న కుమారుడు పొరుగూరికి ఇల్లరికం వెళితే, పెద్ద కుమారుడు అదే ఊర్లో తల్లిదండ్రులకు దూరంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వృద్ధ దంపతులు విడిగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి పోచయ్య చనిపోగా.. మృతదేహాన్ని తాము ఉంటున్న ఇంటి వద్ద ఉంచే పరిస్థితి లేకపోవడంతో పెద్ద కుమారుడు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లారు. తానుంటోంది అద్దె ఇల్లు అని, మృతదేహాన్ని ఇక్కడ ఉంచొద్దంటూ పెద్ద కొడుకు చెప్పాడు. చిన్న కొడుకూ ఇదేమాట చెప్పడంతో మృతదేహాన్ని గ్రామంలోని బస్టాండ్‌కు తీసుకువచ్చి ఉంచారు. కొద్దిసేపటికి.. గ్రామస్థుల సూచనతో గ్రామంలోని రైతు వేదిక భవనంలోకి మృతదేహాన్ని తరలించారు. తన భర్త మృతదేహానికి నీడనివ్వని కుమారులు.. అంత్యక్రియలు కూడా చేయాల్సిన అవసరం లేదని, తానే చేస్తానంటూ యాదవ్వ తానే నిర్వహించింది.

Updated Date - Oct 16 , 2025 | 01:45 AM