Jagga Reddy: ఇందిర, రాజీవ్ ఆదర్శాలను పుణికిపుచ్చుకున్న సోనియా
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:22 AM
దేశప్రజలు దేవతగా కొలిచే ఇందిరాగాంధీ కోడలిగా సోనియాగాంధీ దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు....
కాంగ్రె్‌సకు నష్టమని తెలిసినా.. తెలంగాణ ఏర్పాటు చేశారు
గాంధీజీ, నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు
రాహుల్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్ : తూర్పు జగ్గారెడ్డి
సంగారెడ్డి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశప్రజలు దేవతగా కొలిచే ఇందిరాగాంధీ కోడలిగా సోనియాగాంధీ దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడుస్తూ... ఇందిర, రాజీవ్ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. యూపీఏ పాలనలో దేశ ప్రజలకు మేలు చేసేలా అనేక పథకాలను తీసుకురావడంలో సోనియా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సోనియాగాంధీ ఆలోచనతో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం.. పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడిందని పేర్కొన్నారు. సంగారెడ్డిలో మంగళవారం జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సోనియగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు సోనియగాంధీ, ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి సర్కారు తూచా తప్పకుండా అమలు చేస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం పంపిణీ, తెల్లరేషన్ కార్డుల జారీ, రుణమాఫీ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం అమలు చేసి చూపింందని వివరించారు. ఆర్టీసీని మూసివేయాలని గత ప్రభుత్వం భావిస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో తిరిగి లాభాల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రె్‌సది అని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మీడియాతోపాటు ఎవరికీ స్వేచ్ఛ లేదని, నిరసనలను ఉక్కు పాదంతో అణచివేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను పునరుద్ధరించారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు పోచమ్మల వాళ్లు, గంగిరెద్దుల కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.