Refuse Promotions: మాకొద్దు పదోన్నతులు!
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:54 AM
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేయడం అంటే ఎంతో ఇష్టంగా భావిస్తారు...
ఉన్నతాధికారులకు కొందరు ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ల లేఖలు
హెడ్ ఆఫీసుకు బదిలీకీ చాల మంది అనాసక్తి
పైఆదాయం కోసమేనని గుసగుసలు
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేయడం అంటే ఎంతో ఇష్టంగా భావిస్తారు. కానీ ఎక్సైజ్ శాఖలో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తమకు పదోన్నతులు వద్దంటూ కొందరు డిప్యూటీ కమిషనర్లు ఏకంగా ఉన్నతాధికారులకు లేఖలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. పదోన్నతితో వచ్చే ప్రయోజనాల కంటే ప్రస్తుత స్థానంలోనే ఉంటే వచ్చే అనధికార ఆదాయం ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఖాళీలున్నా అక్కడి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులకు మాత్రమే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే అధికారం ఉండడంతో ఆ పైస్థాయికి వెళితే ఆ అవకాశం కోల్పోతామని ఇంకొందరు భావిస్తున్నారు. అందుకే సుదీర్ఘకాలంగా డీసీలుగానే కొనసాగుతున్నారు. పదోన్నతి తీసుకోవడానికి అవకాశం ఉన్నా తిరస్కరిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో డిప్యూటీ కమిషనర్లుగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో కింది స్థాయిలోని సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లకు పదోన్నతి దక్కడం లేదు. అంతకంటే కింది స్థాయిలోని ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లకు కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పదోన్నతులు రాలేదు. ఇన్నేళ్లలో కేవలం జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఏఎ్‌సవోలకు దశల వారీగా కేవలం 34 మందికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. మిగిలిన వాళ్లకూ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఏవేవో కారణాలు చెప్పి ప్రమోషన్లను ఆపించారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉంటేనే కొత్త మద్యం పాలసీ కింద దరఖాస్తుల సంఖ్య పెంచొచ్చని తొలుత సాకుగా చూపారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పంచాయతీల ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని చెప్పుకొచ్చారు. ఉన్నత స్థాయిలోని అధికారులు ప్రమోషన్లు వద్దంటుండడంతో పదోన్నతులు ఆశించే కింది స్థాయి ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటికే పదోన్నతుల విషయంపై డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) పలు మార్లు సమావేశమైంది. అయినా స్పష్టత రాలేదు. ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను త్వరలో ఒకేసారి చేపడతామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సి.హరికిరణ్ రెండ్రోజుల క్రితం జరిగిన తెలంగాణ ఎక్సైజ్ టీఎన్జీవోస్ సెంట్రల్ ఫోరం సమావేశంలో పేర్కొనడంతో చాలా మందిలో ఆశలు రేకెత్తించాయి. అది ఎప్పుడు జరుగుతుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.