Government Initiative: సమీకృత గురుకులాల్లో సౌరశక్తితో వంట
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:03 AM
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో సోలార్ కిచెన్లు(సౌరశక్తితో పని చేసే వంట గదులు) ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
సోలార్ కిచెన్ల ఏర్పాటుకు ప్రభుత్వ యోచన
గ్యాస్, విద్యుత్ ఖర్చ్చులో 70 శాతం ఆదా
14 గురుకులాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా అమలు
త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో సోలార్ కిచెన్లు(సౌరశక్తితో పని చేసే వంట గదులు) ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఒక్కో యంగ్ ఇండియా గురుకులంలో విద్యార్ధులు, బోధన, బోధనేతర సిబ్బంది కలిపి దాదాపు 3,000 మంది ఉంటారు. వీరిందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు వండి వడ్డించాలి. మూడు పూటలా కలిపి 9,000 మందికి వంట చెయ్యాల్సి ఉంటుంది. సాధారణ విధానంలో ఇంతమందికి భోజనం అందించాలంటే గ్యాస్, విద్యుత్ ఖర్చు భారీగా అవుతుంది. ఈ ఖర్చును తగ్గించేందుకే ప్రభుత్వం అధునాతన సోలార్ కిచెన్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. సోలార్ కిచెన్ల వల్ల గ్యాస్, విద్యుత్ ఖర్చు 70 శాతం మేర ఆదా అవుతుందని అంచనా వేశారు. అయితే, ఈ విధానం ఎంతమేరకు సఫలీకృతం అవుతుందనేది తెలుసుకునేందుకు రాష్ట్రంలోని ఓ 14 గురుకులాల్లో ఫైలట్ ప్రాజెక్టుగా సోలార్ కిచెన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 300 నుంచి 900 మంది వరకు విద్యార్థులున్న గురుకులాలను ఇందుకు ఎంపిక చేస్తున్నారు. 900 మందికి ఏర్పాటుచేసే సోలార్ కిచెన్ కోసం రూ.78లక్షలు, 300 మంది ఉన్న గురుకులానికైతే రూ.45లక్షల వరకు ఖర్చవుతుందని కంపెనీలు ప్రతిపాదనలు అందజేశాయి. ఈ గురుకులాల్లో సోలార్ కిచెన్ల ఏర్పాటుకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు సమాచారం. సోలార్ కిచెన్‌ల ఏర్పాటుపై ప్రభుత్వానికి పలు కంపెనీలు ప్రతిపాదనలు అందించాయి.
వాటి ప్రకారం.. జర్మన్ టెక్నాలజీతో కూడిన సోలార్ డిష్‌ల ద్వారా కిచెన్‌లను నడపనున్నారు. సాధారణంగా వాడే సౌర ఫలకాలు కాకుండా సమీకృత గురుకులాల్లో కొన్ని సౌర ఫలకలతో కూడిన డిష్(యాంటెనా లాంటిది)లను భవనాలపై ఏర్పాటు చేస్తారు. ఈ డిష్‌లు సూర్యుడు ఎటువైపు ఉంటే అటు తిరుగుతూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో భవనంపై 12 డిష్‌లను ఏర్పాటు చేస్తే వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్... వంటతోపాటు విద్యార్థులందరికీ స్నానానికి వేడి నీళ్లు అందించడానికి సరిపోతుందని చెబుతున్నారు.అయితే, ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు, వర్షాలు కురిసినప్పుడు సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. ఏడాదికి 100 రోజులు సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించారు.