Share News

Solar Rooftops: సర్కారు బడులపై సోలార్‌ రూఫ్‌టాప్‌

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:56 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,937 పాఠశాలలపై సోలార్‌ రూఫ్‌టా్‌పలను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు కొన్ని నెలలుగా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తోంది....

Solar Rooftops: సర్కారు బడులపై సోలార్‌ రూఫ్‌టాప్‌

  • 289.25 కోట్లు అవుతాయని అంచనా

  • టెండర్ల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,937 పాఠశాలలపై సోలార్‌ రూఫ్‌టా్‌పలను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు కొన్ని నెలలుగా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తోంది. అయితే ప్రభుత్వ పాఠశాలల పైకప్పులపై సోలార్‌ రూఫ్‌టాప్‌ పెడితే.. వినియోగించుకున్న తర్వాత మిగిలిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించే అవకాశం ఉంటుంది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన ఉదయం 8:30 గంటల నుంచే ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పనిచేస్తాయి. పాఠశాలలు పనిచేస్తున్నంతసేపు జరిగే విద్యుత్‌ ఉత్పత్తిని స్కూళ్లు వాడుకుని.. సాయంత్రం 4 గంటల తర్వాత జరిగే విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించనున్నారు. పాఠశాలల్లో సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుతో పాటు ఐదేళ్లపాటు సమగ్ర నిర్వహణ కాంట్రాక్టుకు కలిపి రూ.289.25 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఒక్కో పాఠశాలలో వినియోగం ఆధారంగా కిలోవాట్‌, రెండు కిలోవాట్లు, గరిష్ఠంగా ఐదు కిలోవాట్ల దాకా ప్లాంట్‌ పెట్టే అవకాశాలున్నాయి. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి వీలుగా టెండర్‌ డాక్యుమెంట్‌ ఖరారు చేయడం, బిడ్‌ ప్రక్రియను పరిశీలించడం, టెండర్‌ దక్కించుకున్న సంస్థ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేయడం వంటి పనుల కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని వేసింది. ఈ కమిటీకి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండగా.. ఇంధన శాఖలో డిప్యూటీ కార్యదర్శి స్థాయి అధికారి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ, సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్లు సభ్యులుగా.. తెలంగాణ రెడ్‌కో వీసీఎండీ మెంబర్‌ కన్వీనర్‌గా ఉండనున్నారు. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ శుక్రవారం జీవో 52ను జారీ చేశారు.

Updated Date - Nov 22 , 2025 | 04:56 AM